నాన్న ఆదేశాలతో అన్ని రకాల సేవలూ అందిస్తున్నాం: బాలకృష్ణ
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:38 PM
నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు బసవతారకం ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 4: బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna) తెలిపారు. ఈరోజు (బుధవారం) బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ అండ్ ఇన్‌స్టిట్యూట్‌లో బ్రాకీథెరపీ యూనిట్, రెండు ఆపరేషన్ థియేటర్లు, మోల్డ్ రూమ్స్, అదనపు క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని బాలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ వాహనాన్ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఆవిష్కరించారని తెలిపారు. ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా.. ఈ ఏడాది ఇప్పటికే 56 వేలకు పైగా పరీక్షలు చేశామని బాలకృష్ణ తెలిపారు.
మామోగ్రఫీతో పాటూ అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఈ మొబైల్ వాహనంలో నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. స్క్రీనింగ్ తర్వాత అవసరమైన వారిని ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో అన్ని రకాల సేవలూ అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి సులభంగా అర్థమయ్యేలా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు బాలయ్య తెలిపారు. మొబైల్ వాహనంలో QR కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన కల్పించే సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. సీఎమ్‌ఐ ప్రోగ్రాం ద్వారా రోగులకు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. సాంబశివ రావు వీల్‌చైర్లను డొనేట్ చేసినందుకు నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు స్పీకర్ క్లీన్ చిట్..
కోఠి కాల్పుల కేసు.. యూపీకి హైదరాబాద్ పోలీసులు..
Read Latest Telangana News And Telugu News