Share News

ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ

ABN , Publish Date - Feb 04 , 2026 | 06:25 AM

వైసీపీ ప్రభుత్వంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు తదితరులపై నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను...

ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ

  • కౌంటర్‌ దాఖలుకు సమయం కోరిన సీఐడీ

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబు తదితరులపై నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. సీఐడీ తరఫు న్యాయవాది ఉన్నం అఖిల్‌ చౌదరి కౌంటర్‌ వేసేందుకు సమయం కోరడంతో విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటజ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ‘‘ఫైబర్‌గ్రిడ్‌, మద్యం పాలసీలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసులను విజయవాడ ఏసీబీ కోర్టు మూసివేసింది. ఈ కేసులకు సంబంధించిన తీర్పు ప్రతులతో పాటు రికార్డులన్నింటినీ ఇవ్వాలని కోరగా కోర్టు నిరాకరించింది.’’ అని పేర్కొంటూ రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి యేము కొండలరావు హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా మూడో పక్షం తీర్పు ప్రతులు పొందడానికి సహజంగా అనుమతించబోమని, ఏసీబీ కోర్టు తీర్పు ప్రతులతో మీరు పొందే ప్రయోజనం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.

Updated Date - Feb 04 , 2026 | 06:26 AM