వక్ఫ్ బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలి :అసదుద్దీన్
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:43 AM
కొత్త ‘ఊమీద్ చట్టం-2025’ ప్రకారం ప్రస్తుత వక్ఫ్‌బోర్డు పాలకమండలిని పునర్‌వ్యవస్థీకరించాలని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం జరగాల్సిన బోర్డు సమావేశం వాయిదా
1,248 ఎరాల వక్ఫ్ భూమి బదిలీ దుర్మార్గం: అబ్దుల్ చందా
హైదరాబాద్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కొత్త ‘ఊమీద్ చట్టం-2025’ ప్రకారం ప్రస్తుత వక్ఫ్‌బోర్డు పాలకమండలిని పునర్‌వ్యవస్థీకరించాలని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత చట్టం ప్రకారం నామినేట్ అయిన సభ్యులు పదవులు కోల్పోయినందున, వారు పాల్గొనే సమావేశాలకు చట్టబద్ధత ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. 2022లో 11 మంది సభ్యులతో వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయగా.. వారిలో ఆరుగురు ఎన్నిక ద్వారా, మరో నలుగురు నామినేషన్ ద్వారా నియమితులయ్యారని ఒవైసీ గుర్తు చేశారు. కొత్త చట్టం ప్రకారం ఎన్నికైన సభ్యులు మాత్రమే తమ పదవీ కాలం ముగిసే వరకు కొనసాగుతారని, గతంలో నామినేట్ అయిన సభ్యుల పదవులు రద్దయినట్లేనని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇద్దరు ఎన్నికైన సభ్యులు, నలుగురు నామినేట్ అయిన సభ్యులు మాత్రమే ఉన్నారని తెలిపారు. కేవలం ఇద్దరు సభ్యులతో సమావేశం నిర్వహించడం చెల్లదని, అందులో తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత ఉండదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వక్ఫ్‌బోర్డు సమావేశాన్ని వాయిదా వేసి, కొత్త పాలకమండలిని తక్షణమే నామినేట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, శనివారం జరగాల్సిన వక్ఫ్‌బోర్డు సమావేశం సరిపడా సభ్యులులేని కారణంగా వాయిదా పడింది. మరోవైపు, వక్ఫ్ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే రంగారెడ్డి జిల్లా అలూర్ షరీఫ్ దర్గా హజ్రత్ ముఖ్దూమ్ బియాబానీకి చెందిన 1,248 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదిలీ చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ అబ్దుల్ ముకీత్ చందా విమర్శించారు. ఈ బదిలీ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన ఆయన.. రెండేళ్లుగా సమావేశం నిర్వహించని ప్రభుత్వం, భూముల బదిలీ ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పుడే భేటీ ఏర్పాటుకు ప్రయత్నించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం
పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News