తెలంగాణలో.. వంద శాతం గెలుస్తాం
ABN , Publish Date - Nov 21 , 2026 | 03:40 AM
‘‘తెలంగాణలో వందశాతం గెలుస్తాం. గెలుస్తున్నాం. ఆ విషయం నాకు వదిలిపెట్టండి’’.. ఇదీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నమాట.
ఆ విషయం నాకు వదిలిపెట్టండి
సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి భారీగా వలసలు
పెరిగే సీట్లలో మాత్రం కొత్త వారికే అవకాశం
జిల్లాకో బలమైన నేత.. 3ఎం వ్యూహం
అమలు బాధ్యత పార్టీ జాతీయ నేతలకు
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో వందశాతం గెలుస్తాం. గెలుస్తున్నాం. ఆ విషయం నాకు వదిలిపెట్టండి’’.. ఇదీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నమాట. రాజకీయ వేదికల మీద చెప్పే సాధారణ డైలాగు కాదిది. ఆంతరంగిక సంభాషణల్లో ఆయన బల్లగుద్దినట్లుగా చెప్పిన మాట. అమిత్‌షా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు సినీ, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనను విడివిడిగా కలిశారు. ఇతర రంగాల వారు కలిసినప్పుడు సాధారణంగా పరస్పర యోగ క్షేమాలు, వారి రంగాలకు సంబంధించిన అంశాలపైనే మాటలు సాగుతాయి. కానీ, ఆయా భేటీల్లో అమిత్‌షా రాజకీయాల ప్రస్తావన తెచ్చారని విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు, ‘‘ఈసారి గెలుస్తున్నాం. అందులో ఎలాంటి సందేహం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి, బీజేపీ బలం ఎంత అన్నది పక్కనపెడితే ఆయన అంత నమ్మకంగా, గట్టిగా చెప్పడంపై పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.
కేంద్ర నాయకత్వమే నేరుగా రంగంలోకి!
రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలపై రాష్ట్ర నేతల నుంచి సమాచారం తీసుకుంటున్నా, కేంద్ర నాయకత్వం దానిపైనే పూర్తిగా ఆధారపడడం లేదు. కొంతకాలంగా కేంద్ర హోంశాఖకు చెందిన నిఘా వర్గాలు, ఇతర వ్యూహకర్తలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాజకీయేతర రంగాల వారిని కలిసి ఇక్కడి పరిస్థితులపై సమాచారం సేకరిస్తున్నారు. మేధావులు, విద్యావేత్తలు, పర్యావరణవేత్తలు.. ఇలా అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేరుగా అమిత్‌షాకు కూడా పంపిస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
బరిలోకి ఒంటరిగానే!
రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలన్న వ్యూహంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉందని సమాచారం. ఎలాంటి పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లడమే వారి తొలి ప్రాధాన్యం. పార్టీలో ఇప్పుడున్న నాయకులను ఏకతాటిపైకి తెస్తూనే, ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు తమవైపు వస్తారన్న నమ్మకంతో ఉన్నారు. తొలుత బీఆర్ఎస్ నుంచి వలసలు ఉంటాయని, కాంగ్రెస్ అధికారపక్షం కాబట్టి ఆ పార్టీ నుంచి ఎన్నికలకు కొన్ని నెలల ముందు చేరికలు ఉంటాయని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తోంది. వాస్తవానికి ఇప్పటికి బీజేపీకి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేరు. పార్టీపై అభిమానం ఉన్నా నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ నేతలే అంతర్గతంగా అంగీకరిస్తున్నారు.
అందుకే ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలకు స్థానం కల్పిస్తామని భరోసా ఇస్తూనే, అనేక స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులను తీసుకోవాలని భావిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెరుగుతుందని, దీంతో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు వీలవుతుందని, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను తీసుకున్నా ఇబ్బంది ఉండదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇతర పార్టీల నుంచి జిల్లాకో బలమైన నాయకుడిని తీసుకోవడం, అందులో అన్ని సామాజిక వర్గాల నేతలు ఉండేలా చూసుకోవడం, అదే సమయంలో ఆయా జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గ నేతలను పార్టీ వైపు ఆకర్షించడం.. ఇదీ కేంద్ర నాయకత్వం వ్యూహం. ఈ వ్యూహం అమలును కూడా రాష్ట్ర నాయకుల మీద వదిలేయకుండా కేంద్ర నాయకత్వమే నడిపించేలా కార్యాచరణ ఉండబోతోందని తెలుస్తోంది.
రాష్ట్ర పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నాక 3ఎం విధానాన్ని అనుసరించాలని అంతర్గతంగా నిర్ణయంచినట్లు సమాచారం. బీసీల్లో బలమైన వర్గాలైన మున్నూరు కాపు, ముదిరాజ్‌లతో పాటు ఎస్సీల్లోని మాదిగలను ఏకతాటిపైకి తేవడమే(సోషల్ ఇంజనీరింగ్) దీని లక్ష్యం. బీసీల్లోని ఇతర వర్గాలన్నింటినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఈ 3 ఎం వ్యూహం అమలుకు గట్టి ప్రయత్నాలు చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్ గతానికి భిన్నంగా రాష్ట్ర బాధ్యతల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆయన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. అయినా అప్పుడప్పుడూ వచ్చిపోవడం కాకుండా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. బెంగాల్, ఒడిశా, తెలంగాణ.. మాడు రాష్ట్రాల బాధ్యతలు చూసిన బన్సల్ ఒక మాట అంటున్నారు. ‘‘తొలి రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక మిగిలింది తెలంగాణే’’ అని అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు
తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..