అవి‘నీటి’ జలగలు.. ఏసీబీకి చిక్కుతున్న జలమండలి తిమింగలాలు
ABN , Publish Date - May 20 , 2026 | 09:40 AM
హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపట్టే వాటర్‌బోర్డులో కొందరు అవినీతి అధికారులు జనాలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు.
తనిఖీల్లో పట్టుబడుతున్న రూ.కోట్ల ఆస్తులు
తాజాగా జీఎం వద్ద దొరికిన రూ.1.10 కోట్ల నగదు
ఆదాయానికి మించిన ఆస్తులంటూ ఆరోపణలు
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేపట్టే వాటర్‌బోర్డులో కొందరు అవినీతి అధికారులు జనాలను డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు. లంచాల కోసం కొందరూ వేధిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. మరికొందరు తప్పించుకుంటున్నారు. ఏసీబీ అధికారుల దాడుల్లో రూ.కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా వాటర్‌బోర్డులో జీఎం స్థాయి అధికారి ఇళ్లపై పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తే రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారం బయటపడడం ఆసక్తికరంగా మారింది. బయటపడని ఆస్తులు, ఇళ్లు తదితరాలు రూ.కోట్లల్లోనే ఉంటాయని సమాచారం. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి ఆస్తులే ఈ స్థాయిలో ఉంటే ఇక అవినీతికి పాల్పడే ఉన్నత ఇంజనీర్ల ఆస్తులు ఏ స్థాయిలో ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అవినీతి అధికారులు
మంగళవారం ఉదయాన్నే వాటర్‌బోర్డు జీఎం ఇళ్లపై జరిగిన ఏసీబీ దాడులు బోర్డులోని అధికారులు, ఉద్యోగుల్లో ఆందోళన రేపాయి. వాటర్‌బోర్డు రెడ్‌హిల్స్ డివిజన్ ప్రాజెక్టు-8కు జనరల్ మేనేజర్‌గా ఉన్న సగ్గం అనంత లక్ష్మీకుమార్ ఇంటిపై ఏసీబీ దాడి చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టు డివిజన్‌లో విధులు నిర్వర్తించే లక్ష్మీ కుమార్‌కు రెండేళ్ల క్రితం జీఎంగా పదోన్నతి లభించగా, పాతబస్తీలోని సీవరేజ్ నెట్‌వర్క్ పనులు నిర్వహణ చూస్తున్నారు. వాటర్‌బోర్డులో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన ఆయన జీఎం స్థాయికి వచ్చేసరికి కోట్లాది రూపాయల ఆస్తులు బయటపడ్డాయి.
గతంలోనూ పలువురు అధికారులు కూడా కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు నేరుగా తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. బోడుప్పల్‌లో కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఓ జనరల్ మేనేజర్ ఏసీబీకి పట్టుబడ్డారు. మరికొందరు నల్లా కనెక్షన్ల మంజూరులో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండ్‌గా దొరికారు. ఆరు నెలల క్రితం మణికొండలో మేనేజర్‌గా ఉన్న మహిళా ఇంజనీరు నల్లా కనెక్షన్ కోసం రూ.30వేలు లంచం తీసుకుంటూ చిక్కారు. అదేవిధంగా వాటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో కూడా ట్యాంకర్ బిల్లులను విడుదల చేయడానికి మొదటి విడతగా లక్ష రూపాయలు లంచ తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్, మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చిక్కారు. ఇలా పలువురు ఏసీబీకి చిక్కిన ఘటనలున్నాయి.
ఆదాయానికి మించిన కేసు ఇదే..!
రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాటర్‌బోర్డులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుకావడం ఇదే మొదటిసారి. వాటర్‌బోర్డులో జీఎం అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) అన్నమాట. వివిధ రకాల పనులు చేపట్టడం.. బిల్లులు మంజూరు చేయడంలో జీఎం కీలకంగా వ్యవహరిస్తారు. వాటర్‌బోర్డులో ఆపరేషన్ మెయింటనెన్స్, ప్రాజెక్టు, రెవెన్యూ, ఐటీ ఇలా వివిధ విభాగాలు ఉండగా, ఆయా విభాగాలు నిత్యం ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటాయి. నీళ్లు రాకపోయినా, విధుల్లో మురుగు ముంచెత్తిన వాటర్‌బోర్డునే సంప్రదిస్తుంటారు. ఈ బోర్డులో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తుండగా, విధి నిర్వహణలో కూడా పెద్దఎత్తున ఏజెన్సీలు, సంస్థలు పని చేస్తున్నాయి. ప్రతి నెలా సుమారు రూ.110 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు వ్యయం ఉండే వాటర్‌బోర్డులో వివిధ బిల్లుల సందర్భంలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే దొరికిన సందర్భంలో దొంగలుగా ముద్రపడుతుండగా, దొరక్కపోతే దొరగా చెలమాణి అవుతున్న పరిస్థితులున్నాయి.
ఆరోపణల వెల్లువ
వాటర్‌బోర్డులో వివిధ స్థాయిలో గల జీఎంలు, సీజీఎంలు, డైరెక్టర్లపై కూడా ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టుకున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. గత ప్రభుత్వంలో రెండు విడుతల్లో ఓఆర్‌ఆర్ ఫేజ్-1, ఫేజ్-2 పనుల్లో భాగంగా శివారు ప్రాంతాల్లో పైపులైన్ల విస్తరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో ఇష్టానుసారంగా పైపులైన్లను పలు బహుళ అంతస్తుల, గేటెడ్ కమ్యూనిటీ కాలనీలకు వేశారు. పైపులైన్లు వేయడం వల్ల భారం వాటర్‌బోర్డుపై పడగా.. నిర్మాణ సంస్థల నుంచి పలువురు ఇంజనీర్లు లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి. నిర్మాణ సంస్థలకు పైపులైన్లు వేయడం ద్వారా వాటర్‌బోర్డుకు ఆదాయం రావాల్సి ఉండగా,
అందుకు భిన్నంగా బోర్డు ఆదాయానికి గండి కొడుతూ పలు నిర్మాణ సంస్థలకు ప్రయోజనం చేకూరేలా పైపులైన్లు వేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల భవనాలకు నల్లా కనెక్షన్ల మంజూరులో కొందకె జీఎంలు, డీజీఎంలు పెద్దఎత్తున చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇంప్రూవ్‌మెంట్ చార్జీల పేరుతో డీజీఎం స్థాయిలో ఓ ధర ఉంటుండగా.. జీఎం స్థాయికి వచ్చేసరికి సగానికి సగం తగ్గిస్తున్నారు. బోర్డుకు రావాల్సిన ఆదాయాన్ని జేబుల్లోకి మళ్ళిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం..
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. బాపట్ల యువకుడి మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News