గ్రేటర్‌లో సమ్మర్ తరహాలో విద్యుత్ వినియోగం
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:49 AM
హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో గ్రేటర్‌లో సమ్మర్ తరహా విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది.
84.82 మిలియన్ యూనిట్లు
బుధవారం 4 వేల మెగావాట్లు దాటిన డిమాండ్
మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో గ్రేటర్‌లో సమ్మర్ తరహా విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. బుధవారం ఈ సీజన్‌లో రికార్డుస్థాయిలో 84.82 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం, 4026 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది సెప్టెంబరు 9న 75.39 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదవ్వగా, ఈ ఏడాది గతేడాది కంటే 10 ఎంయూల వినియోగం అధికంగా ఉంది.
ఎల్‌నినో ప్రభావంతో భారీ వర్షాలు లేకపోవడం, మధ్యాహ్నం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో తేమశాతం తగ్గి వేడి తీవ్రత పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆఫీసులు, ఇళ్లలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం భారీగా పెరిగింది. పగటి పూట 34-38 డిగ్రీల మధ్య నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిపూట సాధారణం కంటే 2-4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రేటర్‌లో 4వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో సెప్టెంబరులో రెండో వారంలోనూ 4 వేల మోగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. వేసవికాలం తరహా విద్యుత్ డిమాండ్ నమోదవుతున్న నేపథ్యంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లపై అదనపు లోడ్ పడి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తుతున్నాయి.
మేలో అత్యధిక డిమాండ్
గ్రేటర్‌లో సాధారణంగా సమ్మర్‌లో 42-45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయినప్పుడు విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరుగుతుంది. కానీ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలతో పాటు గ్రేటర్‌లో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. ఇప్పటి గ్రేటర్‌లో 2026 మే 22న అత్యధికంగా 4782 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌తో 101.07 మిలియప్ యూనిట్ల వినియోగం నమోదైంది.
గత రెండేళ్లలో సెప్టెంబరులో నమోదైన
విద్యుత్ డిమాండ్ (ఎంయూల్లో)
తేది (2025) (2026)
7 3051 - 62.17 3918 - 81.50
8 3560 - 72.40 4058 - 82.95
9 3678 - 75.39 4026 - 84.82
ఈ వార్తలు కూడా చదవండి:
పాము విషానికి కొత్త విరుగుడు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
Read Latest AP News And Telangana News And International News And Telugu News