Share News

సంక్షేమ క్యాలెండర్ రూపొందించండి: జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:27 AM

వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ క్యాలెండర్ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

సంక్షేమ క్యాలెండర్ రూపొందించండి: జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం
AP CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 11: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ క్యాలెండర్ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఏయే సంక్షేమ పథకాలు.. ఏయే తేదీల్లో ఇస్తున్నామనే అంశాన్ని తేదీలతో సహా వెల్లడించాలని సూచించారు. సంక్షేమం కింద అందిస్తున్న నగదు సద్వినియోగం చేసుకునే అంశంపై.. లబ్దిదారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని వారికి స్పష్టం చేశారు.


కులవృత్తులకు సంబంధించి వాల్యూ అడిషన్ చేసేలా.. కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. చేనేత, చేతి వృత్తుల కేంద్రాలను ఎక్స్‌పీరియన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సంక్షేమ పండగలు చేద్దామని వారికి వివరించారు. కాపు కార్పొరేషన్‌ లోన్‌ల విషయంలో.. ఎక్కడైనా నిధులు ఉండిపోతే వాటిని వెంటనే వాడాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నిధులు లేకపోతే తన దృష్టికి తీసుకురండి.. వెంటనే మంజూరు చేస్తానని అన్నారు.


ఫ్యామిలీ మ్యాపింగ్ పేరుతో ఇష్టానుసారం పెన్షన్లు, ఇళ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కరెక్ట్ కాదు.. మన కాన్సెప్ట్ కంబైన్డ్ ఫ్యామిలీ అని చెప్పారు. పెద్ద కుటుంబాలకు అధిక ప్రయోజనాలు కల్పించేలా.. పాలసీలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.


వక్ఫ్ బోర్డు‌‌కు లెక్కలేనన్ని భూములు ఉన్నాయని సీఎం తెలిపారు. అయితే మీకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పటికైనా సక్రమంగా పనిచేసి మైనార్టీ కమ్యూనిటీకి న్యాయం చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. దేవాదాయ శాఖలో ఆదాయం వచ్చినట్టే మైనార్టీ శాఖలో కూడా రావాలని వారికి స్పష్టం చేశారు. ఒక్క వెంకటేశ్వరస్వామి దేవస్ధానంలో ఒక్కరోజులో రూ. 7 కోట్లు ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. ఆస్తులు చాలా ఉన్నాయని.. వాటి నుంచి ఆదాయాన్ని ఆర్జించే మార్గాలు చూడాలన్న వారికి సీఎం వివరించారు. మైనార్టీలో మీరు బలహీనంగానే ఉన్నారు.. వారు బలహీనంగానే ఉన్నారని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇకనైనా వారికోసం మీరు గట్టిగా పనిచేసి న్యాయం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - Sep 11 , 2026 | 12:03 PM