Share News

నాణ్యం కాదు.. నాణెం

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:23 AM

పన్ను దెబ్బతింటే క్యాప్‌ పెట్టించుకుంటాం.. ఊడిపోతే ఇంప్లాంట్‌ పెట్టించుకుంటాం.. అందంగా కనబడకపోతే సరిచేయించుకుంటాం.. కానీ ..

నాణ్యం కాదు.. నాణెం

  • రూపాయి, రూ.5 నాణేలు కరిగించి డెంటల్‌ ఇంప్లాంట్ల తయారీ

  • చిగుళ్ల వాపు, కణజాలం దెబ్బ తినడం వంటి సమస్యలు

  • మహారాష్ట్రలో వెలుగులోకి.. అక్కడ 350కి పైగా ఫిర్యాదులు

  • ఇంప్లాంట్లను సిద్ధం చేయాల్సింది డెంటల్‌ టెక్నీషియన్లే

  • వారు సరిపడా లేక అనర్హులు, శిక్షణ లేనివారితో తయారీ

  • మన రాష్ట్రంలో తనిఖీల్లేవ్‌.. ఫిర్యాదు కూడా కష్టమే!

  • తెలంగాణ, ఏపీలో 40 వేల మంది వరకు దంత వైద్యులు

  • అర్హులైన టెక్నీషియన్లు మాత్రం ఐదారు వందల మందే!

  • ఇక్కడా నాణేలతో ఇంప్లాంట్ల తయారీ ఉండొచ్చనే సందేహాలు

హైదరాబాద్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి- సెంట్రల్‌ డెస్క్‌): పన్ను దెబ్బతింటే క్యాప్‌ పెట్టించుకుంటాం.. ఊడిపోతే ఇంప్లాంట్‌ పెట్టించుకుంటాం.. అందంగా కనబడకపోతే సరిచేయించుకుంటాం.. కానీ జీవితాంతం మన నోట్లో ఉండే ఆ కృత్రిమ పన్ను, దాన్ని బిగించేందుకు వినియోగించే స్ర్కూలు వంటివి తయారయ్యేది ఎక్కడ? ఏ లోహంతో రూపొందిస్తున్నారు? ఎవరి చేతుల్లో రూపుదిద్దుకుంటోంది? ఈ ప్రశ్నలు మనలో చాలామందికి రావు. డెంటిస్టు అర్హతలు చూస్తామేగానీ, వారు తయారు చేయించి తెప్పించే కృత్రిమ దంతాలు, ఇంప్లాంట్ల నాణ్యత గురించి ఆలోచించం. కానీ ఏ మాత్రం నాణ్యత లేని ముడి సరుకుతో, చివరికి రూపాయి, ఐదు రూపాయల నాణేలు కరిగించి, అందులోని లోహాలతో డెంటల్‌ ఇంప్లాంట్లను తయారు చేస్తుండటం కలకలం రేపింది. అసలు దంత వైద్యులకు సరిపడా డెంటల్‌ టెక్నీషియన్లు లేకపోవడం, అసలే మాత్రం వైద్య అర్హతలు లేనివారు ఇష్టారాజ్యంగా డెంటల్‌ ఇంప్లాంట్లను రూపొందిస్తుండటం ఆందోళనకరంగా మారింది.


తెలంగాణ, ఏపీలలో కలిపి 40 వేల వరకు రిజిస్టర్డ్‌ దంత వైద్యులు ఉంటే.. తగిన అర్హత కలిగిన డెంటల్‌ టెక్నీషియన్లు నాలుగైదు వందల మందే ఉండటం గమనార్హం. దంత వైద్యంలో డెంటి స్టు, డెంటల్‌ టెక్నీషియన్‌ చేసే పని వేరు. దంతాల పరిస్థితిని పరీక్షించడం, చికిత్స నిర్ణయించడం, ఏ రకమైన క్యాప్‌ లేదా కృత్రిమ పన్ను అవసరమో నిర్దేశించడం డెంటిస్టు బాధ్యత. ఆ నమూనా, కొలతలు, సూచనల ప్రకారం కృత్రిమ పన్ను, క్రౌన్‌, బ్రిడ్జెస్‌, క్లిప్పులు తదితర ఇంప్లాంట్లను తయారు చేయడం డెంటల్‌ టెక్నీషియన్‌ పని. ఇందుకోసం పంటి నిర్మాణం, డెంటల్‌ మెటీరియల్స్‌, లోహాల స్వభావం, మెటలర్జీ, కృత్రిమ దంతాల తయారీ వంటి అంశాల్లో వారికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఇందుకోసం డిప్లొమా ఇన్‌ డెంటల్‌ టెక్నిషియన్‌(డీడీటీ), డిప్లొమా ఇన్‌ డెంటల్‌ హైజెనిస్ట్‌ (డీడీహెచ్‌వై) కోర్సులు ఉంటాయి. ఇవి రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులే. ఈ డీడీటీ, డీడీహెచ్‌వై కోర్సులు చేసిన టెక్నీషియన్లు లేకుండానే చాలా డెంటల్‌ ఆస్పత్రులు కొనసాగుతున్నాయి. ఈ కోర్సులు చేసిన వారికి ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందని.. ఇతర పారామెడికల్‌ సిబ్బందికే కనీస శిక్షణ ఇచ్చి, డెంటల్‌ ఇంప్లాంట్లు తయారు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


టెక్నీషియన్లూ తక్కువ.. సీట్లూ అంతంతే!

నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ గణాంకాల మేరకు దేశవ్యాప్తంగా 4,06,373 మంది దంత వైద్యులు ఉండగా, రిజిస్టర్డ్‌ డెంటల్‌ టెక్నీషియన్లు 1,500 మంది లోపే ఉన్నారు. అంటే ప్రతి 250 మందికి ఒకరే టెక్నీషియన్‌ ఉన్నారు. తెలంగాణ డెంటల్‌ కౌన్సిల్‌లో 14 వేల మంది, ఏపీలో సుమారు 29 వేల మంది రిజిస్టరై ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలో కేవలం 150 మందిలోపే, ఏపీలో 400 మంది వరకే డెంటల్‌ టెక్నీషియన్లు ఉన్నట్టు అంచనా. అంతర్జాతీయంగా అనుసరించే ప్రమాణాల మేరకు ఒక దంత వైద్యుడికి ఒక టెక్నీషియన్‌ ఉండాలి. కనీసం ఇద్దరు వైద్యులకు ఒకరైనా ఉండాలి. కానీ దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. డెంటల్‌ టెక్నీషియన్‌/మెకానిక్‌ సీట్లు తక్కువగా ఉండటం, పైగా అవగాహన లేకపోవడంతో.. ఈ కోర్సులు చేసేవారు చాలా తక్కువగా ఉంటున్నారు.


నాణ్యత లేని లోహాలతో ఆరోగ్య సమస్యలు

దవడ ఎముకలో శస్త్రచికిత్స ద్వారా అమర్చే డెంటల్‌ ఇంప్లాంట్లను క్లాస్‌-సి వైద్య పరికరాలుగా పరిగణిస్తారు. అంటే కఠినమైన భద్రతా ప్రమాణాలతో రూపొందించి ఉండాలి. నాణ్యత లేని, సరిగా పరీక్షించని లోహాలతో తయారైన ఇంప్లాంట్లు నోటిలో తుప్పు పట్టి లోహ అయాన్లను విడుదల చేస్తాయి. ఫలితంగా చిగుళ్ల వాపు, కణజాలాలు దెబ్బతినడం, అలర్జీలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంప్లాంట్‌ సరిగా రూపొందించపోయినా, సరిగా అమరకపోయినా ఆహార పదార్థాలు చిక్కుకోవడం, చిగుళ్ల వ్యాధులు, లోపలి సహజ పంటికి క్షయం వంటి సమస్యలు వస్తాయి.


సాధారణంగా మెడికల్‌ గ్రేడ్‌ టైటానియం, టైటానియం అల్లాయ్‌, జిర్కోనియా, కోబాల్ట్‌-క్రోమియం అల్లాయ్‌ వంటి పదార్థాలతో డెంటల్‌ ఇంప్లాంట్లు తయారు చేస్తారు. ఇవి శరీర కణజాలంతో సులువగా అనుసంధానం కావడం, తుప్పుపట్టకపోవడం, దవడ ఎముకతో కలిసిపోయే సామర్థ్యం ఉన్నవే. ఇందులో మెడకల్‌ గ్రేడ్‌ టైటానియంను డెంటల్‌ ఇంప్లాంట్ల తయారీ కోసం విస్తృతంగా వినియోగిస్తారు. కానీ చాలా చోట్ల నాసిరకమైన లోహాలు, చివరికి ఐదు రూపాయల నాణేలను కరిగించి అందులోని కోబాల్ట్‌, నికెల్‌ వంటి లోహాలతో ఇంప్లాంట్లు తయారుచేస్తుండటం ఆందోళన రేపుతోంది.


ఫిర్యాదులకూ కష్టమే..

ఒక ఇంప్లాంట్‌ నాణ్యతపై అనుమానం వచ్చినప్పుడు సీడెస్కోకు వైద్య పరికరాల నాణ్యత, లైసెన్సింగ్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు. రాష్ట్రాల్లో ఔషధ నియంత్రణ అధికారులను సంప్రదించవచ్చు. ఇంప్లాంట్‌ వల్ల ప్రతికూల పరిణామం ఎదురైతే, వైద్యుడి చికిత్సా విధానంపై సంబంధిత రాష్ట్ర డెంటల్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయవచ్చు. కానీ నాసిరకమైన డెంటల్‌ ఇంప్లాంట్ల వల్ల వచ్చే ఇబ్బందులను ఏవో ఇతర సమస్యలుగా భావించి, చికిత్స చేయించుకుంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ క్రమంలో డెంటల్‌ ఇంప్లాంట్లు అమర్చుకునేవారు.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు, దిగుమతి చేసుకున్నదా? తయారీ సంస్థ ఏది? బ్యాచ్‌ నంబర్‌, సీరియల్‌ నంబర్‌ ఉన్నాయా? అన్నది పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.


మహారాష్ట్రలో నాణేలతో ఇంప్లాంట్ల తయారీ!

అర్హతలేని వ్యక్తులు డెంటల్‌ ల్యాబ్‌లలో పనిచేయడం, నాణ్యత లేని లోహాలతో కృత్రిమ దంతాలు తయారు చేయడంపై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. గత రెండేళ్లలో 350కిపైగా ఫిర్యాదులు అందాయి. ఆ రాష్ట్రంలో సుమారు 66 వేల మంది రిజిస్టర్డ్‌ దంత వైద్యులుంటే.. అర్హత కలిగిన డెంటల్‌ టెక్నీషియన్లు కేవలం 1,200 మందే, అంటే సగటున 55 మంది దంత వైద్యులకు అర్హత కలిగిన టెక్నీషియన్‌ ఒక్కరే ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐదు రూపాయల నాణేలను కరిగించి డెంటల్‌ ఇంప్లాంట్లు తయారు చేస్తున్నట్టు బయటపడింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. డెంటల్‌ ల్యాబ్‌లు, తయారీదారులు, సరఫరాదారులపై తనిఖీలకు ఆదేశించింది. డెంటల్‌ క్యాప్‌లు, బ్రిడ్జిలు, డెంచర్లు, ఇంప్లాంట్లపై అమర్చే కృత్రిమ పళ్ల తయారీకి ఉపయోగించే ముడిసరుకు, దాని సరఫరాదారు, తయారీ వివరాలను కూడా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


నాణ్యత తనిఖీ మాకు సంబంధం ఉండదు

డెంటల్‌ ఇంప్లాంట్స్‌ నాణ్యత, తనిఖీలనేవి మా పరిధిలోకి రావు. దంత వైద్యులు, డీడీటీ, డీడీహెచ్‌వైల రిజిస్ట్రేషన్‌ వరకే మా బాధ్యత ఉంటుంది. దంత వైద్యం విషయంలో ఎవరైనా మాకు డెంటిస్టులపై ఫిర్యాదు చేస్తే వాటిని టేకప్‌ చేస్తాం. డీడీటీ, డీడీహెచ్‌వై కోర్సుల్లో చేరడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అవగాహన లేకపోవడం, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటమే కారణం.

- డాక్టర్‌ రవి కిరణ్‌,

రిజిస్ట్రార్‌, తెలంగాణ డెంటల్‌ కౌన్సిల్‌


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 04:36 AM