Share News

వ్యాపారాలు కుదేలు

ABN , Publish Date - May 07 , 2026 | 10:40 PM

తాజాగా కేంద్రప్రభుత్వం కమర్షియల్‌ విభాగం గ్యాస్‌ సిలిండర్ల ధరలను ఊహించని రీతిలో పెంచడంతో వ్యాపారం కొనసాగని పరిస్థితి నెలకొన్నది. రూ.2350 ధరలో ఉన్న కమర్షియల్‌ సిలిండర్‌ ధరపై రూ.993ను కేంద్రం పెంచింది. దీంతో సిలిండర్‌ ధర రూ.3,343కు పెరిగింది. దీంతో టీకొట్లు, స్వీట్‌ దుకాణాలు, చిరుతిండ్లు, ఇతర తిను బండారాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు ఇక తాము బతకడం కష్టమని భావిస్తున్నారు.

వ్యాపారాలు కుదేలు

  • హోటళ్లు, రెస్టారెంట్లు, వీధివ్యాపారులపై ఆర్థిక భారం

  • కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెంపుతో అవస్థలు

కాగజ్‌నగర్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): తాజాగా కేంద్రప్రభుత్వం కమర్షియల్‌ విభాగం గ్యాస్‌ సిలిండర్ల ధరలను ఊహించని రీతిలో పెంచడంతో వ్యాపారం కొనసాగని పరిస్థితి నెలకొన్నది. రూ.2350 ధరలో ఉన్న కమర్షియల్‌ సిలిండర్‌ ధరపై రూ.993ను కేంద్రం పెంచింది. దీంతో సిలిండర్‌ ధర రూ.3,343కు పెరిగింది. దీంతో టీకొట్లు, స్వీట్‌ దుకాణాలు, చిరుతిండ్లు, ఇతర తిను బండారాలను తయారు చేసి విక్రయించే వ్యాపారులు ఇక తాము బతకడం కష్టమని భావిస్తున్నారు. యుద్ధం ప్రభావంతో ధరలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నా ఇంత భారీగా ఎవరు ఊహించలేదు. కాని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఊహకే అందని రీతిలో సిలిండర్‌ ధరను పెంచేసి ఆహార వ్యాపారులకు షాక్‌ ఇచ్చింది.


తాజా ధరల పెంపుతో వ్యాపారులు విల విలలాడుతున్నారు. ఇప్పటికే సిలిండర్‌ కొరతను నెట్టుకొస్తున్న తమపై ధర భారం కుదేలు చేసిందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెరిగిందని, వ్యాపారులు, డీలర్లు చెబుతున్నారు. సాధారణంగా రూ.50 నుంచి రూ.150 పెరిగే అవకాశాలుఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.993 పెరుగుతుండడంతో అంతా హైరాన పడుతున్నారు. జిల్లాలో చిన్నా చితక హోటళ్ల నుంచి బడా హోటళ్లకు వరకు సిలిండర్‌ ధరల ప్రభావం చూపనుంది. రోడ్డు పక్కగా చిన్న చిన్న బిర్యానీ, భోజన హోటళ్ల యాజమానులైతే దిక్కు తోచడం లేదని పలువురు చెబుతున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ సాధారణ ధరతో పెరిగితే రూపాయి నుంచి రెండు రూపాయల వరకు టీ, టీఫిన్స్‌ ధరలు పెంచవచ్చని చెబుతు న్నారు. కానీ ఏకంగా వేయి రూపాయల వరకు సిలిండర్‌ పెరుగడంతో దీని లోటు భర్తీ కావాలంటే తాము కూడా ధర పెంచక తప్పదని పలువురు నిర్వహకులు తెలియజేస్తున్నారు.


ఇప్పటికే కొరత..

జిల్లాలో ఒక వైపు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల ఆశించిన మేర దొరకడం లేదు. మరో వైపు ప్రస్తుతం ధర విపరీతంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం పలు హోటళ్లు మూసివేసుకుంటున్నారు. దొరికిన కూడా ఇప్పుడు అధిక ధరలు పెట్టడం తమకు నిర్వహణ కూడా భారంగా ఉంటుందని పలువురు తెలిపారు. గ్యాస్‌ ధర పెరిగితే హోటళ్ల నిర్వహణ కూడా కష్టంగా మారే పరిస్థితి ఉంది. పెట్రోలు ధరలు పెరిగితే పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి తలెత్తె అవకాశాలున్నాయి. జనవరిలో రూ. 111, ఫిబ్రవరిలో రూ. 49, మార్చిలో రూ. 144, ఏప్రిల్‌లో రూ. 194, మేలో రూ. 993 కేంద్రం పెంచింది.


ఐదు నెలల్లో కేంద్ర ప్రభుత్వం కమర్షియల్‌ సిలిండర్‌పై రూ. 1491 ధర పెంచింది. కేంద్రం పదే, పదే కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెంచడం పై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు గ్యాస్‌ ధర పెరుగుతుండడంతో ప్రత్యామాయంగా కట్టెలతో కొనసాగిద్దామంటే అవి కూడాదొరకని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మార్కెట్‌ కట్టెలు ధర కూడా అధికంగా పెరుగుతుందని, అవి కూడా దొరకని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. ఒక వైపు గ్యాస్‌ ధరలు, మరో వైపు కట్టెల సరుకులు ఆశించిన మేర ధరలు ఒక్కసారిగా పెరిగి పోవడంతో చిరు వ్యాపారులు, హోటళ్లపై పెను భారం పడుతోంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి గ్యాస్‌ ధరలను తగ్గించాలని అంతా డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 08 , 2026 | 07:59 AM