ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం: టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు
ABN , Publish Date - Apr 13 , 2026 | 03:19 PM
ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని.. పార్టీ స్థాయిలో కాదని టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు వివరించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బలంతో గుండాయిజం చేసినా ప్రజలు బీజేపీకే పట్టం కట్టారని అన్నారు.
నిర్మల్, ఏప్రిల్ 13: పొత్తులపై తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(TBJP Chief Ramchander Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడాన్ని పురస్కరించుకుని నిర్మల్‌లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు స్థానిక నాయకుల మధ్య మాత్రమే జరిగిందని.. పార్టీ స్థాయిలో కాదని వివరించారు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల బలంతో గుండాయిజం చేసినా ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చి పట్టం కట్టారని అన్నారు. కాంగ్రెస్ అధికారబలం ఖానాపూర్‌లో పనిచేయలేదని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధాకరం...
తలసరి ఆదాయం ఉంటేనే అసెంబ్లీ సీట్లు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రాంచందర్ రావు విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పేదవారిని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని అణచివేయాలనే ఉద్దేశంతో చేసినట్లుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మహిళల హక్కుల గురించి మాట్లాడలేదని వ్యాఖ్యానించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంతో ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ కోసం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనుందని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ
సమ్మెపై ఆలోచించండి.. తొందరపడొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And Telugu News