Share News

వాట్సాప్‌లో అదిరిపోయే ఏఐ ఫీచర్లు.. ఏమేం ఉన్నాయంటే.?

ABN , Publish Date - Aug 22 , 2026 | 01:59 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం అదరిపోయే ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త ఫీచర్లతో చాటింగ్ చేస్తూ ఏఐ సాయం పొందొచ్చు.

వాట్సాప్‌లో అదిరిపోయే ఏఐ ఫీచర్లు.. ఏమేం ఉన్నాయంటే.?
WhatsApp AI features

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం అదరిపోయే ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త ఫీచర్లతో చాటింగ్ చేస్తూ ఏఐ సాయం పొందొచ్చు. అలాగే ఒక్క టెక్స్ట్‌తో ఇమేజ్‌లు, స్టికర్లు క్రియేట్ చేసుకోవడం సహా ప్రొఫైల్ ఫొటోలను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా వాట్సాప్‌లోని ఏఐ ఫీచర్లు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి.


చాటింగ్‌ సమయంలోనే..

పర్సనల్ లేదా గ్రూప్ చాట్ చేస్తున్న సమయంలోనే ఏఐ సాయం పొందవచ్చు. అంటే చాట్ చేస్తున్నప్పుడు ఏదైనా సమాచారం కావాల్సి వస్తే.. @Meta AIని ట్యాగ్ చేస్తే వస్తుంది. ఉదాహరణకు గ్రూప్‌లో దీపావళి గురించి చర్చ జరుగుతుంటే.. దీపావళి ఎప్పుడని మెటాను ట్యాగ్ చేసి అడగొచ్చు. క్యాలెండర్ తీయకుండానే సమాధానం తెలుసుకోవచ్చు. అలాగే గ్రూప్‌లో మనం చూడని మెసేజ్‌లు ఏమైనా ఉంటే వాటి సారాంశాన్ని కూడా పొందవచ్చు. దీంతో యూజర్లకు సమయం ఆదా అవుతుంది.


ఒక్క క్లిక్‌తో స్టిక్కర్ రెడీ..

కొత్త ఫీచర్లతో వాట్సాప్‌లో ఏఐను ఉపయోగించి ఇమేజ్‌లు, స్టిక్కర్లు తయారు చేసుకోవచ్చు. ఎలాంటి చిత్రాలు కావాలో టెక్స్ట్ ఇస్తే.. క్షణాల్లో ఏఐ అందిస్తుంది. అంతేకాక మూడ్స్ బట్టి స్పెషల్ స్టిక్కర్లు చేసుకోవచ్చు. మన ప్రొఫైల్ ఫొటోలను ఎడిట్ చేయమన్నా ఏఐ చేసిపెడుతుంది.


ఇంకా ఏమున్నాయంటే..

ఫొటోలను వాట్సాప్‌లో అప్‌లోడ్ చేసి అందులోని వస్తువులు, ప్రదేశాల గురించి సమాచారం అడిగితే ఏఐ ఇట్టే ఇచ్చేస్తుంది. ఒకవేళ ఆ వస్తువులను తొలగించమన్నా తొలగిస్తుంది. కేవలం టెక్స్ట్ కమాండ్స్‌తో ఈ పనులన్నీ సులభంగా చేసేయొచ్చు. అయితే ఇలా ఏఐతో చేసిన సంభాషణలు ఎవరికీ తెలియకుండా ఉండేందుకు వాట్సాప్ ‘ప్రైవేట్ చాట్ మోడ్’ను అందిస్తోంది. దీనివల్ల చాట్స్ ఎక్కడా సేవ్ కావు. ఈ ఫీచర్లు యాప్/వెబ్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. చాట్స్‌లో ట్యాగ్ చేసి వీటిని వినియోగించుకోవచ్చు. కొన్ని ఫీచర్లు మాత్రం ప్రాంతాన్ని బట్టి దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి.


ఇవీ చదవండి:

యూట్యూబ్ వ్యూస్‌లో భారీ మార్పు.. ఇక వీడియో ప్లే అయిన వెంటనే వ్యూగా లెక్కింపు..

క్యాన్సర్‌ను నయం చేసే ఏఐ.. త్వరలో రానుందా..?

Updated Date - Aug 22 , 2026 | 01:59 PM