గుడ్ న్యూస్! పిక్సెల్ వాచ్-5లో ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను గుర్తించే ఫీచర్
ABN , Publish Date - Aug 13 , 2026 | 04:16 PM
మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్త తీసుకునేందుకు వీలుగా గూగుల్ ఓ హెల్త్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: మధుమేహ రోగులు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో డయాబెటిస్ ముప్పు పొంచి ఉన్న భారతీయులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా గూగుల్ ఓ హెల్త్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మధుమేహం బారిన పడకముందు శరీరంలో పెరిగే ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను గుర్తించే ఫీచర్‌ను పిక్సెల్ వాచ్ 5లో జోడించింది. రక్త పరీక్ష అవసరం లేకుండా పిక్సెల్ వాచ్ సాయంతో ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను అంచనా వేసేలా ఈ ఫీచర్‌ను ప్రత్యేక ఆల్గొరిథమ్‌తో తీర్చిదిద్దింది. ఆరోగ్యంపై కన్నేసి ఉంచేందుకు ఉద్దేశించిన హెల్త్ గార్డియన్ సూట్ ఉత్పత్తుల్లో భాగంగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఈ ఫీచర్ పిక్సెల్ వాచ్ 3 మొదలు ఆ తరువాత మోడల్స్ అన్నిటిలోనూ ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ నాటికి దశలవారీగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.
ఏమిటీ ఇన్సులీన్ రెసిస్టెన్స్?
రక్తంలోని చక్కెరలను శరీరంలోని కణాల్లోకి చేర్చి వాటికి తగినంత శక్తి అందేలా చేసే హార్మోన్ ఇన్సులీన్. అయితే, శరీరంపై ఈ హార్మోన్ ప్రభావం తగ్గడాన్ని ఇన్సులీన్ రెసిస్టెన్స్ అని అంటారు. ఈ రెసిస్టెన్స్ పెరుగుతున్నప్పుడు రక్తంలోని చక్కెరను కణాల్లోకి చేర్చేందుకు శరీరం అదనంగా ఇన్సులీన్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. మరోలా చెప్పాలంటే, రక్తంలోని చక్కెర నిల్వలను అదుపులో పెట్టేందుకు శరీరం మరింత శ్రమపడాల్సి వస్తుంది. దీర్ఘకాలం పాటు పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యక్తులు క్రమంగా బరువు పెరుగుతారు. అంతిమంగా టైప్-2 మధుమేహం బారినపడతారు.
పైకి ఎలాంటి సూచనలూ లేకుండానే శరీరంలో ఇన్సులీన్ రెసిస్టెన్స్ పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. తమకు ఈ సమస్య ఉన్న విషయాన్ని చాలా మంది గుర్తించలేరని కూడా అంటున్నారు. గూగుల్ అంచనా ప్రకారం, దాదాపు 40 శాతం మంది వయోజనులకు ఈ సమస్య ఉన్న విషయం తెలియదు. ఈ నేపథ్యంలో ఇన్సులీన్ రెసిస్టెన్స్‌పై ముందుగా ఓ కన్నేసి ఉంచితే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందన్న భావనతో గూగుల్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. వివిధ కారణాలతో డయాబెటిస్ ముప్పు ఎదుర్కొంటున్న భారతీయులకు ఈ ఫీచర్ మేలు చేస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ఇన్సులీన్ రెసిస్టెన్స్ గుర్తింపు ఇలా..
వ్యక్తుల్లో గుండె కొట్టుకునే తీరు, నిద్ర సమయాలు, రోజువారీ కదలిక వంటి వాటి ఆధారంగా పిక్సెల్ వాచ్‌లో ఈ ఫీచర్ ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను అంచనా వేస్తుంది. ప్రత్యేక ఆల్గోరిథమ్ ఆధారంగా శరీరంలో ఇన్సులీన్ రెసిస్టెన్స్ ఎంత పెరిగిందనేది లెక్కిస్తుంది. రెసిస్టెన్స్ పెరుగుతోదంటే వెంటనే ఈ వాచ్ యూజర్‌ను అప్రమత్తం చేస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను కూడా సూచిస్తుంది.
ఈ ఆల్గోరిథమ్ బాగా పనిచేస్తోందని గూగుల్ చెప్పింది. సాధారణ రక్త పరీక్షల ఫలితాలతో ఆల్గోరిథమ్ పనితీరును సరిపోల్చి చూశామని కూడా చెప్పింది. ఇందుకు సంబంధించిన అధ్యాయాన్ని నేచర్ జర్నల్‌లో ప్రచురితమైనట్టు కూడా వెల్లడించింది. అయితే, ఇన్సులీన్ రెసిస్టెన్స్‌ను ఈ ఆల్గోరిథమ్ కచ్చితంగా ఎలా అంచనా వేస్తుందనే విషయాన్ని మాత్రం గూగుల్ ఇంకా వెల్లడించాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. వాచ్‌టైమ్ రెట్టింపు!
ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు అదృశ్య వాటర్ మార్క్..