ఏఐ కంటెంట్‌ను గుర్తించేందుకు అదృశ్య వాటర్ మార్క్..
ABN , Publish Date - Aug 11 , 2026 | 11:52 AM
ఏఐ కంటెంట్ గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు క్లాడ్ ఏఐ మోడల్స్ మాతృసంస్థ అదృశ్య వాటర్‌మార్కులను జోడించేందుకు సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో సోషల్ మీడియాలో ఏఐ కంటెంట్ ఇష్టారీతిన పెరిగిపోతోంది. మనుషులు తయారు చేసిన కంటెంట్‌కు ఏఐ కంటెంట్‌కు మధ్య తేడా గుర్తించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏఐ కంటెంట్ గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు ఆంథ్రోపిక్ సంస్థ అదృశ్య వాటర్ మార్కులను తీసుకొచ్చింది. క్లాడ్ మోడల్స్‌తో సిద్ధం చేసిన టెక్స్ట్, ఇమేజీలకు ఈ వాటర్‌మార్కును జోడిస్తారు. యూరోపియన్ ఏఐ యాక్ట్ ప్రకారం, ఈ వాటర్ మార్క్ విధానానికి ఆంథ్రోపిక్ శ్రీకారం చుట్టింది.
కంటికి కనిపించని వాటర్ మార్క్స్
క్లాడ్ ఏఐ మోడల్స్‌తో సిద్ధం చేసిన టెక్స్ట్‌లో మనుషులు గుర్తించలేని విధంగా ఈ వాటర్ మార్క్‌ను జత చేయనున్నారు. ఈ టెక్స్ట్‌ను కాపీ చేసి మరో డాక్యుమెంట్‌లో పేస్టు చేసినా తొలగిపోని విధంగా వాటర్‌మార్కును రూపొందించారు. స్వల్ప ఎడిటింగ్ చేసినా ఈ వాటర్ మార్కు తొలగిపోదు. ఇక చిత్రాలకు సంబంధించి కూడా ఇలాంటి వాటర్ మార్కు అందుబాటులో ఉంటుంది. ఏఐతో సిద్ధం చేసిన చిత్రాలకు చెందిన ప్రోవెనెన్స్ మెటాడేటాలో ఈ వాటర్ మార్కును చేరుస్తారు. దీంతో, ఇమేజీలకు ఏఐతో మార్పులు చేశారా? లేదా? అన్నది ఇట్టే తెలిసిపోతుంది. ఇమేజీకి ఇతరత్రా విధానాల్లో చేసిన మార్పులను కూడా వాటర్ మార్క్ ఆధారంగా గుర్తించొచ్చు.
ఇటీవల కాలంలో విడుదలైన అన్ని క్లాడ్ ఏఐ మోడల్స్‌లో ఈ వాటర్ మార్కు అందుబాటులో ఉంటుందని ఆంథ్రోపిక్ సంస్థ పేర్కొంది. ఆంథ్రోపిక్ క్లౌడ్ పార్ట్‌నర్స్ అయిన ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ ఫౌండ్రీల్లో కూడా ఈ వాటర్ మార్క్ అందుబాటులో ఉంటుంది.
ఒక కంటెంట్‌ను క్లాడ్ ఏఐతో ఉత్పత్తి లేదా మార్పులు చేశారా? లేదా? అనే విషయాన్ని ఇతరులు గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక డిటెక్షన్ వ్యవస్థను కూడా రూపొందిస్తున్నట్టు ఆంథ్రోపిక్ పేర్కొంది. అయితే, ఈ వాటర్ మార్కు ఉన్న కంటెంట్ కనిపిస్తే అది క్లాడ్ ఉత్పత్తి చేసినదని నిర్ధారణకు రాకూడదని కూడా ఆంథ్రోపిక్ పేర్కొంది. ఇతరుల కంటెంట్‌కు క్లాడ్‌తో మార్పులు చేసిన సందర్భాల్లో కూడా ఈ వాటర్ మార్కు ఉంటుందని పేర్కొంది. వాటర్ మార్కు ఉంటే కంటెంట్‌ను క్లాడ్ ప్రాసెస్ చేసినట్టుగా మాత్రమే భావించాలని కూడా సంస్థ స్పష్టం చేసింది.
భారీ స్థాయిలో కంటెంట్‌కు మార్పులు చేసిన సందర్భాల్లో వాటర్ మార్కు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి, వాటర్ మార్క్ లేనంత మాత్రాన కంటెంట్‌ను ఏఐతో ఉత్పత్తి చేయనట్టు భావించకూడదని కూడా ఆంథ్రోపిక్ పేర్కొంది. ఇక గూగుల్ డీప్ మైండ్ కూడా సింథటిక్ ఐడీ పేరిట ఇలాంటి అదృశ్య వాటర్‌మార్కులను వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలనూ చదవండి:
‘ఏఐ’తో ఉద్యోగ కోతల కన్నా.. నైపుణ్యాల మార్పే అధికం!
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్.. సరికొత్త ఆఫర్లు ఇవే..