Share News

కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. వాచ్‌టైమ్ రెట్టింపు!

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:31 PM

కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది.

కొత్త యూట్యూబర్లకు కష్టకాలం.. వాచ్‌టైమ్ రెట్టింపు!
YouTube Monetization

ఇంటర్నెట్ డెస్క్: కొత్తగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకునే క్రియేటర్లకు ఆ సంస్థ షాకిచ్చింది. యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రొగ్రామ్(YPP)లో 2018 తర్వాత తొలిసారిగా భారీ మార్పులు చేయనున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. ప్లాట్‌ఫామ్‌లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మానిటైజేషన్ నిబంధనలను కంపెనీ మరింత కఠినతరం చేసింది. షార్ట్స్‌, ప్రకటనలు, ప్రీమియం ఆదాయ భాగస్వామ్యానికి సంబంధించిన నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనలు 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.


కొత్త క్రియేటర్లకు మరింత కఠినం..

యూట్యూబ్ నుంచి ఆదాయం పొందే అర్హత సాధించాలంటే కొత్త కంటెంట్ క్రియేటర్లు మునుపటి కంటే రెండింతల వాచ్‌టైమ్‌ను సంపాదించుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల ప్రకారం.. క్రియేటర్లు తమ ఛానెల్‌లో మానిటైజేషన్ పొందేందుకు గడిచిన ఏడాది వ్యవధిలో 8,000 గంటల వాచ్‌ టైమ్ లేదా గత 90 రోజుల్లో కనీసం 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1,000 సబ్‌స్క్రైబర్లు ఉండటంతో పాటు ఏడాదిలో 4,000 గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ ఉంటే మానిటైజేషన్‌కు అర్హత లభించేది. అయితే ఇప్పటికే YPPలో భాగమై ఆదాయం పొందుతున్న క్రియేటర్లకు ఈ నిబంధనలు వర్తించవు.

YouTube.jpg


2027 ఫిబ్రవరి 1 నుంచి షార్ట్స్‌ ద్వారా నిరంతరం ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్‌ ఆదాయాన్ని పొందాలంటే.. గత 90 రోజుల్లో కనీసం 10 మిలియన్ల షార్ట్స్‌ వ్యూస్‌ సాధించాలి. ఈ పరిమితిని చేరుకోలేని ఛానళ్లు YPPలో కొనసాగుతాయి. అయితే షార్ట్స్‌ రెవెన్యూ షేరింగ్‌ నిలిచిపోతుంది. మళ్లీ 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్‌ సాధిస్తే యూట్యూబ్ నుంచి ఆదాయం పొందొచ్చు.

క్రియేటర్ల ఆదాయ అవకాశాలను పెంచేందుకు యూట్యూబ్‌ కొత్త ఇన్సెంటివ్‌ ప్రొగ్రామ్‌లను కూడా తీసుకురానుంది. యూట్యూబ్‌ షాపింగ్‌లో నిర్దిష్ట మైలురాళ్లు చేరిన వారికి బోనస్‌లు, బ్రాండ్‌ డీల్స్‌కు ప్రోత్సాహకాలు, ట్రెండింగ్‌ కంటెంట్‌ ప్రారంభించి అభివృద్ధి చేసే వారికి అదనపు ఆదాయ అవకాశాలు కల్పించనుంది.


ప్రీమియం లైట్‌తో అదనపు ఆదాయం..

యూట్యూబ్‌ ప్రీమియం లైట్‌ను అందుబాటులో ఉన్న అన్ని దేశాలకు విస్తరించనున్నారు. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా వచ్చే నికర ఆదాయంలో 30 శాతం, ప్రీమియం లైట్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 60 శాతం క్రియేటర్ల కోసం కేటాయిస్తారు. సభ్యులు చూసే సమయం, వీడియోల వ్యూస్‌ ఆధారంగా ఈ మొత్తాన్ని క్రియేటర్లకు పంపిణీ చేస్తారు. లాంగ్ ‌ఫార్మ్‌ వీడియోలకు 55 శాతం, షార్ట్స్‌కు 45 శాతం రెవెన్యూ షేర్‌ లభిస్తుంది. అయితే యూట్యూబ్‌లో కొత్తగా మానిటైజేషన్ పొందాలనుకునే వారికి ఈ నిబంధనలు కాస్త సవాలుతో కూడుకున్నవే. ఇప్పటి వరకు ఉన్నదాని కంటే రెట్టింపు వాచ్‌టైమ్ సాధించడం అంత సులభమైన పని కాదు. కాబట్టి కేవలం వైరల్ కంటెంట్‌పై ఆధారపడకుండా ఒరిజినల్ కంటెంట్‌ను ఇస్తూ వ్యూస్ సాధించగలిగితే క్రియేటర్లకు భవిష్యత్తులో మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

వన్డే ప్రపంచ కప్ 2027: వెస్టిండీస్‌కు షాక్.. డైరెక్ట్ క్వాలిఫికేషన్ మిస్

నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

Updated Date - Aug 11 , 2026 | 12:45 PM