Share News

యూట్యూబ్ వ్యూస్‌లో భారీ మార్పు.. ఇక వీడియో ప్లే అయిన వెంటనే వ్యూగా లెక్కింపు..

ABN , Publish Date - Aug 18 , 2026 | 04:58 PM

యూట్యూబ్‌.. వీడియోల వ్యూస్‌ లెక్కింపులో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

యూట్యూబ్ వ్యూస్‌లో భారీ మార్పు.. ఇక వీడియో ప్లే అయిన వెంటనే వ్యూగా లెక్కింపు..

న్యూఢిల్లీ: యూట్యూబ్‌.. వీడియోల వ్యూస్‌ లెక్కింపులో కీలక మార్పు చేయనుంది. ఆగస్టు 24 నుంచి అన్ని వీడియో ఫార్మాట్లకు ఒకే విధమైన వ్యూ కౌంటింగ్‌ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో లాంగ్‌ ఫార్మాట్ వీడియోలతో పాటు యూట్యూబ్ షార్ట్స్ కూడా ఉంటాయి.

కొత్త విధానం ప్రకారం.. వీడియో ప్లే అయిన వెంటనే, అంటే ‘వెరీ ఫస్ట్‌ ఫ్రేమ్‌’ కనిపించిన క్షణం నుంచే ఒక వ్యూగా లెక్కించనుంది. వ్యూ నమోదు కావడానికి ఇకపై కనీస వాచ్‌టైమ్‌ అవసరం ఉండదు. ఈ మార్పుతో వ్యూస్‌ వేగంగా పెరుగుతాయని యూట్యూబ్‌ తెలిపింది. అన్ని వీడియో ఫార్మాట్లలో క్రియేటర్లకు లభించే ఎక్స్‌పోజర్‌ను ఒకే ప్రమాణంతో చూపించడం ద్వారా, బ్రాండ్ డీల్స్‌లో వారి విలువను మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేయడమే ఈ మార్పు ఉద్దేశమని యూట్యూబ్ పేర్కొంది.


యూట్యూబ్ ఆదాయంపై ప్రభావం ఉంటుందా?

ఈ వ్యూ కౌంటింగ్‌ మార్పు యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్(YPP)లో క్రియేటర్లకు చెల్లించే ఆదాయ విధానాన్ని నేరుగా మార్చదని యూట్యూబ్‌ స్పష్టం చేసింది. అదే సమయంలో.. క్రియేటర్లకు ‘ఎంగేజ్‌డ్ వ్యూస్’ అనే మెట్రిక్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. తద్వారా వీడియోను ప్లే చేసిన తర్వాత ఎంతమంది ప్రేక్షకులు నిజంగా వీడియోను చూడటం కొనసాగించారో క్రియేటర్లు తెలుసుకోవచ్చు.


క్రియేటర్లలో భిన్నాభిప్రాయాలు..

యూట్యూబ్‌ కొత్త నిర్ణయంపై క్రియేటర్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూస్‌ సంఖ్య పెరిగినా.. సగటు వాచ్‌ డ్యూరేషన్‌ తగ్గే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం బ్రాండ్‌ డీల్స్‌ కోసం వ్యూస్‌ కీలకమైన మెట్రిక్‌ కావడంతో కొత్త విధానం క్రియేటర్లకు ప్రయోజనం కలిగించవచ్చని భావిస్తున్నారు. అలాగే RPM, పేఔట్స్‌పై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హోమ్‌పేజ్‌లో వీడియో ఆటోప్లే అయినప్పటికీ వ్యూ లెక్కించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా క్రియేటర్లలో చర్చకు దారితీసింది. అయితే ఈ అంశంపై యూట్యూబ్‌ అధికారికంగా మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా.. ఆగస్టు 24 నుంచి వీడియో ప్లే అయిన తొలి ఫ్రేమ్‌ నుంచే వ్యూ లెక్కించే విధానం అమల్లోకి రానుంది. అయితే ప్రేక్షకులు వీడియోను కొనసాగించి చూశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ‘ఎంగేజ్‌డ్ వ్యూస్’ మెట్రిక్ కొనసాగనుంది.


Also Read:

మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్: సీఎం చంద్రబాబు

యమధర్మరాజు రెస్ట్‌లో ఉన్నట్లున్నాడు.. కొద్దిలో తప్పించుకున్నాడు..!

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ

Updated Date - Aug 18 , 2026 | 05:18 PM