ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ
ABN , Publish Date - Aug 18 , 2026 | 04:31 PM
‘చలో పార్లమెంట్’ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 18: ‘చలో పార్లమెంట్’ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు మాజీ సీజే, రిటైర్డ్ డీజీపీతో కమిటీ ఏర్పాటు కానుంది. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు బుధవారం వెలువడనున్నాయని ధర్మాసనం ప్రకటించింది.
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసకు సంబంధించిన వీడియో ఫుటేజీ, సీసీటీవీ రికార్డింగ్స్‌ను కమిటీకి అందజేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తామని పేర్కొంది. పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీతో పాటు ఇతర ప్రాంతాల్లో మహిళా నిరసనకారులే లక్ష్యంగా దాడులు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలు, నమోదైన ఫిర్యాదులను కూడా ఈ ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని ధర్మాసనం తెలిపింది. బాధితులందరి వాదనలను కమిటీ వింటుందని, కమిటీ సిఫార్సుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.
విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల వివరాలను అందజేయాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తాను ధర్మాసనం ఆదేశించింది. నేర చరిత్ర లేని విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. ఆర్టికల్ 19 కింద నిరసనలు తెలిపే అధికారం విద్యార్థులకు ఉందని, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఐఆర్‌లపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
ఫ్లోరైడ్.. నిజంగా మెదడును ప్రభావితం చేస్తుందా?
ఏపీలో 6,534 టీచర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం