మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 18 , 2026 | 04:53 PM
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు.
అమరావతి: బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడం కేవలం ఎన్నికల హామీ కాదని, అది తమ రాజకీయ సిద్ధాంతంలో భాగమని చంద్రబాబు స్పష్టం చేశారు. హామీలు ఇవ్వడంతోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
గత ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్ల విషయంలో చేసిన అన్యాయన్ని సరిచేయడానికి ప్రత్యేక క్యాబినెట్ పెట్టి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. 2024 ఎన్నికల్లో ఈ స్ధాయి గెలుపుకు కారణం బిసిల వల్లేనని చెప్పుకొచ్చారు. 94శాతం స్ట్రయిక్ రేట్ 57శాతం ఓట్లు వచ్చాయంటే అది బిసిల వల్ల, నాయకత్వంపై ఉన్న నమ్మకం వల్ల మాత్రమేనని పేర్కొన్నారు. బిసిలకు న్యాయం చేయాలని తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకున్నామన్నారు.
బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. ఈ రెండు అంశాలకు సంబంధించిన నిబంధనలు చట్టాల్లో ఉన్నాయని వివరించారు. అర్బన్ లోకల్ బాడీల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. రాబోయే రోజుల్లో 28 జిల్లా పరిషత్‌లు ఏర్పడే అవకాశం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను కాపాడటంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందనే విషయాన్ని ఈ నిర్ణయం మరోసారి నిరూపించిందన్నారు.
టీడీపీ ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో ముందుకెళ్లారని తెలిపారు. ఎర్రం నాయుడు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, తెలంగాణలో దేవేందర్ గౌడ్ వంటి నాయకులను రాజకీయంగా ముందుకు తీసుకురావడంలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని చంద్రబాబు పేర్కొన్నారు.
1995లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంఎస్ 176ను హైకోర్టులో సవాలు చేయగా.. న్యాయస్థానం దానిని కొట్టివేసిందని, అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని చంద్రబాబు విమర్శించారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 24.5 శాతానికి తగ్గించారని వ్యాఖ్యానించారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వడంలో టీడీపీకి ముందు, టీడీపీ తర్వాత అనే చర్చ జరగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read:
టాటా సన్స్ ఏజీఎమ్ వాయిదా.. కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి..
డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్.. సిడ్నీ కోర్టు కీలక తీర్పు