డ్రంకెన్ డ్రైవ్ కేసు: డేవిడ్ వార్నర్‌కు షాక్.. సిడ్నీ కోర్టు కీలక తీర్పు
ABN , Publish Date - Aug 18 , 2026 | 04:56 PM
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో సిడ్నీ కోర్టు షాకిచ్చింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో సిడ్నీ కోర్టు షాకిచ్చింది. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వార్నర్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది. అంతేకాకుండా ఇకపై వాహనం నడపాలంటే కారులో ఇంటర్ లాక్ పరికరాన్ని అమర్చుకోవాలని ఆదేశించింది. 39 ఏళ్ల వార్నర్ ఏప్రిల్ 5న సిడ్నీలో డ్రైవింగ్ చేస్తూ పోలీసుల ర్యాండమ్ బ్రీత్ టెస్టింగ్ సైట్ వద్ద పట్టుబడిన సంగతి తెలిసిందే. బ్రీత్ టెస్టులో అతడి శరీరంలో పరిమితికి రెండింతల కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత నెలలోనే వార్నర్ తన నేరాన్ని అంగీకరించాడు.
కారులో పిల్లలు.. అదే మరింత సీరియస్
డ్రంకెన్ డ్రైవ్ సమయంలో వార్నర్ వాహనంలో పిల్లలు కూడా ఉన్నారని కోర్టు గుర్తించింది. ఈ అంశం నేరాన్ని మరింత తీవ్రమైనదిగా చేసిందని జడ్జి పేర్కొన్నారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా డ్రంకెన్ డ్రైవింగ్‌ను నిరోధించాల్సిన అవసరం మరింత ముఖ్యమని జడ్జి స్పష్టం చేశారు. కాగా వార్నర్ డ్రైవింగ్‌పై పూర్తిగా నిషేధం విధించలేదు. కానీ మళ్లీ వాహనం నడపాలంటే ఇంటర్‌లాక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని, కారులో ఇంటర్ లాక్ పరికరాన్ని అమర్చుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ పరికరం కారు నడిపే వ్యక్తిలో ఆల్కహాల్ పర్సెంటేజ్‌ను గుర్తిస్తుంది. మద్యం తాగినట్లు ఆ పరికరం గుర్తిస్తే వాహనం స్టార్ట్ కాకుండా అడ్డుకుంటుంది.
సిడ్నీ థండర్ కెప్టెన్సీపై ప్రభావం?
ఈ కేసులో దోషిగా తేలడంతో రాబోయే బిగ్ బాష్ లీగ్ (BBL) సీజన్‌లో సిడ్నీ థండర్ జట్టుకు వార్నర్ కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్.. ఈస్టర్ విరామ సమయంలో స్వదేశానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదైన తర్వాత కూడా పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లి తన PSL బాధ్యతలను పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు కోర్టు తీర్పుతో అతడి భవిష్యత్ టీ20 లీగ్ అవకాశాలు, ముఖ్యంగా సిడ్నీ థండర్ కెప్టెన్సీపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి:
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు
17 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు.. పూర్తి జాబితా ఇదే!