టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. రిషభ్ పంత్ అరుదైన రికార్డు
ABN , Publish Date - Aug 18 , 2026 | 03:53 PM
భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌లో లాహిరు కుమార బౌలింగ్‌లో సిక్సర్ బాదిన పంత్.. ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.
భారత బ్యాటర్ల జాబితాలో పంత్ కంటే ముందు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(90), రోహిత్ శర్మ(88) ఉన్నారు. ప్రస్తుతం భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న వారిలో రవీంద్ర జడేజా(82) మాత్రమే ఈ ఫీట్‌కు కాస్త దగ్గరిలో ఉన్నాడు. యువ ప్లేయర్లు శుభ్‌మన్ గిల్(47), యశస్వి జైస్వాల్(45) సిక్సర్లతో కొనసాగుతున్నారు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో శతక సిక్సర్ల మార్క్‌ను అందుకున్న నాలుగో బ్యాటర్‌గా పంత్ నిలిచాడు. అతడి కంటే ముందు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ (138), న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (107), ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100) ఈ ఘనత సాధించారు. అయితే, వీరందరి కంటే వేగంగా పంత్ ఈ రికార్డును అందుకోవడం విశేషం. కేవలం 51 టెస్టుల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్ 149 ఏళ్ల చరిత్రలో 80 టెస్టుల్లోపు ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రిషభ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. బెన్ స్టోక్స్ 82వ టెస్టులో 100వ సిక్సర్ బాదాడు.
ఇవి కూడా చదవండి:
డీఆర్‌ఎస్‌తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్ చేసుకున్న రాహుల్!
బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్