కృత్రిమ మేధతో త్వరలోనే మానవాళికి పెను ముప్పు.. ఏఐ గాడ్ ఫాదర్ హెచ్చరిక
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:37 PM
ఏఐ ఒకవైపు ఆశ్చర్యపరుస్తూ మరోవైపు భయపెడుతోంది. ‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ’ అని పేరు పొందిన జెఫ్రీ హింటన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ భయాన్ని మరింత పెంచాయి.
ఇంటర్నెట్ డెస్క్: ‘గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ’ అని పేరు పొందిన నోబెల్ గ్రహీత జెఫ్రీ హింటన్ కృత్రిమ మేధపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదైనా లేదా వచ్చే సంవత్సరమైనా ఏఐ కారణంగా పెను ముప్పు ఒకటి రాబోతోందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. దాని వల్ల ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా కుదేలవుతుందని, విద్యుత్ రంగం దెబ్బతింటుందని చెప్పారు. AI: Probably Nothing to Worry అనే డాక్యుమెంటరీ ప్రదర్శనకు ముందు హింటన్ ఈ హెచ్చరికలు చేశారు. అసలు ఏఐ సాంకేతికతను సృష్టించకుండా ఉంటే మానవాళికి మంచి జరిగేదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఈ ఏడాదైనా.. లేదా 2027లో అయినా ఒక పెను ముప్పు రాబోతోంది. ఏఐ ఎంత ప్రమాదకరమో అది అందరికీ అర్థమయ్యేలా చెప్పబోతోంది. దాంతో ఏఐని అభివృద్ధి చేస్తున్న సంస్థలు నిద్రలోంచి మేల్కొంటాయి’ అని హింటన్ పేర్కొన్నారు.
వారికి డబ్బే ముఖ్యం
ఏఐ అభివృద్ధి కోసం నిరంతరంగా శ్రమిస్తున్న వారిని ఈ సందర్భంగా హింటన్ తీవ్రంగా విమర్శించారు. ‘తమ జేబులు నింపుకోవడం కోసం మార్క్ జుకర్‌బర్గ్(మెటా ఏఐ), ఎలాన్ మస్క్(గ్రోక్ ఏఐ), సామ్ ఆల్ట్మాన్(చాట్‌జీపీటీ) వంటి వారు కృత్రిమ మేధను అభివృద్ధి చేస్తున్నారు. కానీ దాని వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వారు పట్టించుకోరు. వారికి డబ్బే ముఖ్యం’ అని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతానికి మానవ అదుపులోనే ఉన్నప్పటికీ.. ఏఐ సొంత భాషను తయారు చేసుకుంటే అది కట్టుతప్పడం ఖాయమని వివరించారు. కృత్రిమ మేధ మానవాళికి ముప్పుగా మారకముందే ఏదో ఒకటి చేయాలని హింటన్ తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
ఇది నిరసనల జమానా: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సరదా వ్యాఖ్య
కళ్లతో కసరత్తులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఇమిటేట్ చేసిన రవిశాస్త్రి