ఇది నిరసనల జమానా: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సరదా వ్యాఖ్య
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:57 PM
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల రొటేషన్‌పై దాఖలైన ఓ పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు చీఫ్ సరదా వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల రొటేషన్‌పై దాఖలైన ఓ పిటిషన్ విషయంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో నిరసనలు చేపట్టకుండా సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించారని సరదాగా ప్రశ్నించారు. ఇటీవల కాలంలో నిరసనలతో దేశరాజధాని మార్మోగిపోతున్న నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఈ కామెంట్స్ చేశారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను కూడా రొటేషన్ చేయాలంటూ పిటిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ ‘మీరు రాంగ్ నంబర్‌కు ఫోన్ చేసినట్టు ఉన్నారు. ఇది నిరసనలు, ప్రదర్శనల జమానా.. మీరు కూడా అదే మార్గంలో వెళితే బాగుంటుందేమో’ అని అన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది కూడా అంతేసరదాగా స్పందించారు. తమకు అసలు అలాంటి ఉద్దేశమే లేదని చెప్పారు. తమకు గొంతు గరగర కూడా ఉందని చెప్పారు.
యూపీ సుల్తాన్‌పూర్‌కు చెందిన జగదీశ్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎస్టీ, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల కారణంగా కొన్ని కుటుంబాలే లబ్ధి పొందాయని ఆరోపించారు. పంజాయతీ, పురపాలక సంస్థల ఎన్నికల్లో అనుసరిస్తున్నట్టు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను రొటేట్ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రొటేషన్ విధానం లేకపోవడం ఆర్టికల్ 14, 15, 19లను ఉల్లంఘించడమేనని చెప్పారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాలా బాగ్చీ, వీ మోహన మాట్లాడుతూ ఓటింగ్ కులం ఆధారంగానే ఉంటుందని భావించడం తప్పని చెప్పారు. ఎవరికి ఓటేయాలనేది ప్రజల నిర్ణయమేనని చెప్పారు. ఓ నియోజకవర్గం రిజర్వ్ అయినంత మాత్రాన ప్రజల ఓటు హక్కుపై ప్రభావం పడదని అన్నారు. ఎవరికైనా ఓటు వేసే హక్కు ప్రజలకు ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
సీపీఆర్ ఎందుకు చేయలేదు? ఢిల్లీ చిన్నారి మరణంపై తల్లిదండ్రుల ప్రశ్న
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్