ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:28 PM
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ కల్పించే నిబంధనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ కల్పించే నిబంధనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. 2023 నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ పిటిషనర్ అరుణ్ కుమార్ అగర్వాల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి, భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది (CEC Lifetime Immunity).
2023లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్'లోని సెక్షన్ 16 ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ నిబంధన ప్రకారం.. సీఈసీ లేదా ఎన్నికల కమిషనర్ అధికారిక విధుల నిర్వహణలో చేసిన లేదా మాట్లాడిన విషయాలపై ఎలాంటి సివిల్, క్రిమినల్ కేసులను కోర్టులు స్వీకరించకూడదు. ఇప్పటికే కొనసాగుతున్న కేసులను కూడా కొనసాగించకూడదు. పదవిలో ఉన్నప్పుడే కాకుండా పదవీ విరమణ తర్వాత కూడా ఈ రక్షణ వర్తిస్తుంది. ఈ నిబంధన ఎన్నికల కమిషనర్లకు అవసరానికి మించిన రక్షణ కల్పిస్తోందని పిటిషనర్లు వాదిస్తున్నారు (Election Commissioners Act 2023).
అధికారిక విధుల పేరుతో తప్పులు చేసినా, దురుద్దేశంతో వ్యవహరించినా, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. ఇది రాజ్యాంగంలోని 14, 21వ అధికరణాలతో పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, న్యాయవాది అరుణ్ కుమార్ అగర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది (Section 16 CEC Act).
ఓటరు జాబితా నుంచి తప్పుగా పేరు తొలగించినా, అభ్యర్థికి అన్యాయం జరిగినా, ఎన్నికల సంఘంలో అవినీతి జరిగినా బాధితులకు న్యాయపరమైన పరిష్కారం లేకుండా పోతుందని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత 2023 బిల్లులో ఎన్నికల కమిషనర్లకు ఇలాంటి సంపూర్ణ రక్షణ కల్పించే నిబంధన లేదని, అనంతరం బిల్లుకు సవరణ ద్వారా సెక్షన్ 16ను చేర్చారని, ఇందుకు తగిన కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు పెద్ద సంఖ్యలో సస్పెన్షన్‌లో ఉన్న సమయంలో ఈ రక్షణ నిబంధనతో కూడిన బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని పిటిషనర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..