సీపీఆర్ ఎందుకు చేయలేదు? ఢిల్లీ చిన్నారి మరణంపై తల్లిదండ్రుల ప్రశ్న
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:39 PM
ఢిల్లీలోని ఓ పాఠశాలలో తాజాగా మూడో తరగతి బాలిక హఠాన్మరణం చెందిన ఘటన కలకలం రేపుతోంది. బాలిక తల్లిదండ్రులు మాత్రం స్కూల్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని ఓ పాఠశాలలో తాజాగా మూడో తరగతి బాలిక హఠాన్మరణం చెందిన ఉదంతం కలకలానికి దారితీసింది. క్లాసులో అకస్మాత్తుగా కుప్పకూలిన బాలికను (9) ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. బాలిక తల్లిదండ్రులు మాత్రం స్కూల్ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కూతురికి సరైన ప్రాథమిక చికిత్స అందలేదని, సీపీఆర్ చేయలేదని ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్‌గా మారింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, గేమ్స్ పీరియడ్ ముగిశాక బాలిక క్లాస్‌లోకి వచ్చింది. బాలిక బాగా అలిసిపోయినట్టు నడుం మీద చేతులు పెట్టుకుని నిలబడి కనిపించింది. ఆ తరువాత కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. క్లాస్‌లోని టీచర్ వెంటనే స్పందించి బాలికను కుర్చీలో కూర్చోబెట్టే ప్రయత్నం చేసింది. కానీ చిన్నారి మాత్రం స్పందనల్లేకుండా అచేతనంగా ఉండిపోయింది.
ఆ తరువాత కొన్ని క్షణాల పాటు బయటకు వెళ్లి తిరిగొచ్చిన టీచర్ చిన్నారిని తీసుకుని వైద్య సాయం కోసం బయటకు వెళ్లింది. బాలిక కుప్పకూలడంతో స్కూల్ సిబ్బంది చిన్నారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు.
చిన్నారి గుండెపోటుతో కుప్పకూలిపోయిందని స్కూల్ ప్రిన్సిపాల్ భావన మలిక్ తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ‘ఇది చాలా విచారకరం. పిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాము. అచేతనంగా మారిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తెలిపారు’ అని ఆమె చెప్పారు. స్కూల్లో నర్సు ఉందని చెప్పారు. చిన్నారి గడ్డానికి గాయం అయిన విషయాన్ని కూడా వారు గమనించారని తెలిపారు.
అయితే, స్కూల్లో మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన వసతులు సరిగా లేవని బాలిక కుటుంబం ఆరోపించింది. చిన్నారి కుప్పకూలిన వెంటనే సీపీఆర్ ఎందుకు చేయలేదని ప్రశ్నించింది. చిన్నారి గడ్డానికి గాయం కారణంగానే ఆమెకు స్పృహతప్పి ఉండవచ్చని తాము భావించామని స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
అగ్నివీర్‌లకు కేంద్రం గుడ్‌న్యూస్.. సర్వీస్ కాలం రెండేళ్లు పెంపు