యశస్వి 155 పరుగులు.. న్యూజిలాండ్‌తో టెస్టులకు అవకాశం దక్కుతుందా?
ABN , Publish Date - Nov 03 , 2026 | 11:32 AM
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ అందుకున్నాడు. వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇండియా ఎ తరఫున అదరగొట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫామ్ అందుకున్నాడు. వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఇండియా ఎ తరఫున అదరగొట్టాడు. న్యూజిలాండ్ ఎతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో అజేయ శతకంతో చెలరేగాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 162 బంతుల్లో 155 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సెలెక్టర్లకు గట్టి సందేశం పంపాడు.
ఇటీవల కాలంలో జైస్వాల్ ఫామ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. జూన్‌లో అఫ్గానిస్థాన్‌పై వన్డే సెంచరీ చేసిన తర్వాత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 160 పరుగులే చేశాడు. ఇందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి. న్యూజిలాండ్ ఎతో రెండో అనధికారిక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ఫ్రేజర్ షీట్ బౌలింగ్‌లో నాలుగు బంతులకే డకౌటయ్యాడు. దీంతో అతడి ఫామ్‌పై విమర్శలు వచ్చాయి. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకంతో వాటన్నింటికీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.
కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు..
నవంబర్ 19 నుంచి న్యూజిలాండ్-భారత్ రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. దీనికి ముందు జైస్వాల్ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు ఊరటనిచ్చే అంశం. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో 17, 5, 0 పరుగులకే పరిమితమైన అతడు.. కీలక సమయంలో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. 155 పరుగులతో అజేయంగా నిలిచి తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులో యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కలేదు. న్యూజిలాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు జైస్వాల్ కీలకంగా మారే అవకాశం ఉంది. మరి సెలెక్టర్లు అతడిని తుది జట్టులోకి ఎంపిక చేస్తారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ స్టార్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై
తీరం దాటిన మురసు తుఫాన్.. 110కి.మీ వేగంతో ఈదురుగాలులు!