అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ స్టార్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:59 AM
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘ది బిగ్ షో’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే 38 ఏళ్ల మ్యాక్సీ.. తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘ది బిగ్ షో’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే 38 ఏళ్ల మ్యాక్సీ.. తన నిర్ణయాన్ని వెల్లడించాడు. 14 ఏళ్ల పాటు ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. ఎన్నో అద్భుత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 149 వన్డేలు, 130 టీ20లు, 7 టెస్టులు ఆడిన మ్యాక్స్‌వెల్.. 2015 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.
ఇప్పటికే 2025 జూన్ 2న వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మ్యాక్సీ.. 2026 ఫిబ్రవరిలో ఒమన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. నవంబర్ 21 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు. మరోవైపు ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌కు కూడా మ్యాక్స్‌వెల్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వీడ్కోలు మ్యాచ్ ఆడాలనుకున్నా..
‘టీ20 ప్రపంచకప్‌కు ముందు, ఆ తర్వాత నా రిటైర్మెంట్ గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. ఆస్ట్రేలియా జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. బంగ్లాదేశ్ పర్యటనలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, వారు వాటిని సద్వినియోగం చేసుకోవడం చూశాం. జట్టు భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తోంది. కానీ ఎంసీజీలో నాకు ఓ వీడ్కోలు మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందేమోనని ఆశించాను. మన చిన్నప్పటి హీరోలు, అభిమానించే ఆటగాళ్లు తమ సొంత మైదానాల్లో ఘనంగా వీడ్కోలు పొందడం చూస్తుంటాం. అలాంటి కల నాకూ వచ్చింది. గత 15 ఏళ్లుగా ఎంసీజీ నాకు సొంత ఇంటిలా అనిపించింది. అందుకే అక్కడ చివరి మ్యాచ్ ఆడాలనే చిన్న కోరిక కలిగింది. కానీ సెలెక్టర్లు తీసుకుంటున్న నిర్ణయాలను పూర్తిగా అర్థం చేసుకోగలను. రాబోయే 12 నుంచి 24 నెలల్లో జట్టులో చాలా మార్పులు జరగనున్నాయి. 2028 ఒలింపిక్స్ కూడా దగ్గరపడుతుంది. యువ ఆటగాళ్లను గుర్తించి, అంతర్జాతీయ క్రికెట్ ఒత్తిడికి అలవాటు పడేలా చేయడం జట్టుకు అవసరం. బిగ్‌బాష్‌లో ఆడటం ద్వారా మాత్రమే అలాంటి అనుభవం పూర్తిగా రాదు’ అని పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. ఫ్రాంచైజీ క్రికెట్లో మ్యాక్స్‌వెల్ తన ఆటను కొనసాగించనున్నాడు. ముఖ్యంగా బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. తనదైన వినూత్న షాట్లు, మెరుపు ఇన్నింగ్స్‌లతో క్రికెట్ ప్రపంచాన్ని అలరించిన ‘ది బిగ్ షో’ అంతర్జాతీయ ప్రయాణానికి తెరపడింది.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ గెలిచిన ఆనందంలో పాక్.. షాకిచ్చిన ఐసీసీ!
ఐర్లాండ్‌పై నమీబియా చరిత్రాత్మక విజయం..