న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై గిల్ క్లారిటీ
ABN , Publish Date - Nov 03 , 2026 | 10:19 AM
న్యూజిలాండ్‌తో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే బుధవారం ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక ప్రకటన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో భారత్ ఐదు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా తొలి వన్డే బుధవారం ప్రారంభం కానుంది. దీనికి ముందు భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక ప్రకటన చేశాడు. టాప్-4 బ్యాటర్ల స్థానాలు ఖరారయ్యాయని, ఐదు, ఆరు స్థానాల్లో మాత్రం పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉంటాయని వెల్లడించాడు. కాగా ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు మాత్రమే గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చివరి రెండు వన్డేల్లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
‘భారత జట్టు టాప్-4 బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పు ఉండదు. నాతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తొలి నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. ఐదు, ఆరు స్థానాల విషయంలో మాది ఫ్లెక్సిబుల్ విధానం. టాప్-4లో అందరూ కుడిచేతి వాటం బ్యాటర్లే ఉంటారు. కాబట్టి ఎడమచేతి వాటం బ్యాటర్ అవసరమైతే అక్షర్ భాయ్ ముందుకు వస్తాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టి కేఎల్ భాయ్ కూడా ముందుగా బ్యాటింగ్‌కు రావచ్చు. అందుకే ఆ రెండు స్థానాల్లో కొంత సౌలభ్యం పాటిస్తాం’ అని గిల్ వెల్లడించాడు.
మెడ నొప్పిపై గిల్ క్లారిటీ
గతంలో మెడ నొప్పితో ఇబ్బందిపడిన గిల్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేశాడు. ‘నాకు ఎలాంటి సమస్య లేదు. ఫిట్‌గా ఉన్నా. దాదాపు గంటన్నర పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. ఫీల్డింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేశాను. ప్రస్తుతం ఎలాంటి అసౌకర్యం లేదు’ అని గిల్ పేర్కొన్నాడు. కాగా న్యూజిలాండ్‌లో గిల్ వన్డే రికార్డు అంత ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు ఆ దేశంలో ఐదు వన్డేలు ఆడిన అతడు కేవలం 124 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో రాబోయే సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలతో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసీస్ స్టార్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ గుడ్‌బై
తీరం దాటిన మురసు తుఫాన్.. 110కి.మీ వేగంతో ఈదురుగాలులు!