Share News

వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా: యశస్వి జైస్వాల్

ABN , Publish Date - Apr 29 , 2026 | 03:49 PM

ఐపీఎల్ 2026లో 400 పరుగులు పూర్తి చేసుకుని లీడింగ్ స్కోరర్‌గా ఉన్న వైభవ్‌కు యశస్వి జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ అందించాడు. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడిగా టీనేజర్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తోందని జైస్వాల్‌ను బ్రాడ్‌కాస్టర్ పామీ మ్బాంగ్వా అడిగారు. తనను సీనియర్ అనడంతో ఆశ్చర్యానికి గురైన జైస్వాల్ సరదాగా స్పందించాడు.

వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా: యశస్వి జైస్వాల్
Yashasvi Jaiswal

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో యువ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. పంజాబ్‌కు రాజస్థాన్ బ్యాటర్లు ఈ సీజన్‌లో తొలి ఓటమి రుచి చూపించారు . ఈ విజయంలో యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(43), యశస్వి జైస్వాల్(51) కీలక పాత్ర పోషించారు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసి అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన సహచర ఆటగాడు యశస్వి చేతుల మీదుగా వైభవ్ ‘ఆరెంజ్ క్యాప్’ను అందుకున్నాడు. ఈ క్రమంలో సీనియర్ ఆటగాడిగా టీనేజర్‌తో కలిసి ఆడటం ఎలా అనిపిస్తోందని జైస్వాల్‌ను బ్రాడ్‌కాస్టర్ పామీ అడిగారు. తనను సీనియర్ అనడంతో ఆశ్చర్యానికి గురైన జైస్వాల్.. సరదాగా స్పందించాడు.


‘నేనేమీ అంత పెద్దవాడిని కాదు. నేను కూడా ఇంకా చాలా చిన్నవాడినే. కాకపోతే వైభవ్ సూర్యవంశీ నా కంటే చాలా చిన్నోడు. దీని గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. వైభవ్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. అతను అద్భుతంగా ఆడుతున్నాడు. అవతలి ఎండ్‌లో నిలబడి ఈ కుర్రాడు నిర్భయంగా బంతిని కొట్టే విధానాన్ని చూసి నేనెప్పుడూ సంతోషిస్తా’ అని జైస్వాల్ వెల్లడించాడు. తన బ్యాటింగ్ గురించి కూడా యశస్వి మాట్లాడాడు. ‘ముల్లాన్‌పుర్ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము మా దూకుడును యథావిథిగా కొనసాగించాలి. సరైన అవకాశం దొరికినప్పుడల్లా ధైర్యంగా షాట్లు బాదాలి. అందుకే నేను కూడా చెత్త బంతులు వస్తే కూడా వదలకుండా బాదేయాలని అనుకున్నా. పైగా మేం 200కు పైగా పరుగులు సాధించాలని ముందే అనుకున్నాం. కాబట్టి మాకు ఒక మంచి ఆరంభం లభించడం చాలా ముఖ్యం. ఆ దిశగానే బ్యాటింగ్ చేశాం’ అని యశస్వి పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?

సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్

Updated Date - Apr 29 , 2026 | 04:33 PM