Share News

నాకు భారత బౌలర్లు నచ్చరు.. పాకిస్థాన్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 01:15 PM

పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడుతున్న నవాజ్.. ఓ టీవీ ఇంటర్వ్యూలో భారత బౌలర్లపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

నాకు భారత బౌలర్లు నచ్చరు.. పాకిస్థాన్ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Hasan Nawaz

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం చెలరేగింది. పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో ఆడుతున్న నవాజ్.. ఓ టీవీ ఇంటర్వ్యూలో భారత బౌలర్లపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. భారత్- పాకిస్థాన్ మధ్య చారిత్రక వైరం కారణంగా 2013 తర్వాత ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్న విషయం తెలిసిందే. పాక్‌పై అధికంగా టీమిండియాదే ఆధిపత్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో నవాజ్ భారత బౌలర్లపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


‘టీమిండియాతో ఆడేటప్పుడు నాకు ఎక్కువ మోటివేషన్ ఉంటుంది. భారత బౌలర్లపై విరుచుపడి భారీ షాట్లు బాదేయాలనే ఆలోచన సహజంగానే వస్తుంది. నెట్ రన్‌రేట్ గురించి ఆలోచించకుండా వారిపై భారీ స్కోర్ చేయాలనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే.. నాకు భారత బౌలర్లు నచ్చరు. వారిని నేనసలు ఇష్టపడను. నాకు మరో అవకాశం వస్తే.. టీమిండియా బౌలర్లపై ఒత్తిడి తెచ్చి పాక్ జట్టును గెలిపిస్తా’ అని నవాజ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నవాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. అతడి ఆట గురించి మాట్లాడేప్పుడు సంబంధం లేకుండా భారత బౌలర్ల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏంటని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.


ఇక నవాజ్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, 2025లో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన నవాజ్ ఇప్పటివరకు 25 టీ20 మ్యాచ్‌ల్లో 457 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 4 మ్యాచ్‌ల్లో 113 పరుగులు సాధించాడు. పీఎస్ఎల్ 2026లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న నవాజ్.. 10 మ్యాచ్‌ల్లో 291 పరుగులు చేశాడు.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన స్మృతి మంధాన

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

Updated Date - Apr 29 , 2026 | 01:15 PM