మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్
ABN , Publish Date - Apr 29 , 2026 | 10:14 AM
పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో పంజాబ్ తమ తొలి ఓటమిని నమోదు చేసింది. అయితే ఈ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో అజేయంగా దూసుకెళుతున్న పంజాబ్ కింగ్స్‌కు ఎట్టకేలకు చెక్ పడింది. పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తమ తొలి ఓటమిని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లు.. 222 పరుగుల స్కోర్ చేశారు. 223 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించేసింది. ఆఖరిలో ఫెర్రీరా, శుభమ్ దూబె భారీ షాట్లతో విరుచుకుపడటంతో ఆర్ఆర్ గెలుపు లాంఛనమైంది. అయితే తమ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.
‘ఈ వికెట్‌పై 223 పరుగుల స్కోర్ చేయడం చాలా గొప్ప విషయం. పిచ్ కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. అయితే ఈ భారీ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోలేకపోవడం నిరాశ కలిగించింది. మేము స్లో బంతులు, యార్కర్లు వేయాలని ప్రణాళిక వేసుకున్నాం. కానీ వాటిని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమయ్యాం. మిడిల్ ఓవర్లలో రాజస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ పిచ్‌ను బాగా అర్థం చేసుకుని, దానికి తగ్గ ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఫెర్రీరా, శుభమ్ దూబె ఆడిన ఇన్నింగ్స్‌ను మెచ్చుకోకుండా ఉండలేము. వారిద్దరు నెలకొల్పిన భాగస్వామ్యమే మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది. ఈ మ్యాచ్‌లో మాకు బౌలింగ్‌లో కలిసి రాలేదు. మా తదుపరి మ్యాచ్‌కు కాస్త విరామం దొరికింది. సరైన ప్రణాళికలతో బలంగా తిరిగొస్తాం’ అని శ్రేయస్ వెల్లడించాడు.
మ్యాచ్ విషయానికొస్తే..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్(59), స్టోయినిస్(62*) హాఫ్ సెంచరీలతో రాణించారు. 223 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్.. 4 బంతులు మిగిలి ఉండగానే ఆటను ముగించింది. డొనొవాన్ ఫెర్రీరా(52*; 26 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్‌లు), శుభమ్ దూబె(31*; 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆడి ఆర్ఆర్ జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో రాజస్థాన్ ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఓడినప్పటికీ 13 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉంది.
ఇవి కూడా చదవండి:
ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్
పీఎస్‌ఎల్‌లో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన బాబర్