Share News

పంజాబ్‌కు తొలి ఝలక్‌

ABN , Publish Date - Apr 29 , 2026 | 02:06 AM

ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. లీగ్‌ ఆరంభమైన నెల రోజులకు ఈ జట్టు తొలి ఓటమి రుచి చూసింది....

పంజాబ్‌కు తొలి ఝలక్‌

నేటి మ్యాచ్‌

ముంబై X సన్‌రైజర్స్‌

వేదిక: ముంబై, రా.7.30 నుంచి

ఫెరీరా, వైభవ్‌ జోరు

6 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ గెలుపు

ఫెరీరా (26 బంతుల్లో6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 నాటౌట్‌)

ముల్లన్‌పూర్‌: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న పంజాబ్‌ కింగ్స్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. లీగ్‌ ఆరంభమైన నెల రోజులకు ఈ జట్టు తొలి ఓటమి రుచి చూసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ నిలకడైన ఆటతీరుతో శ్రేయాస్‌ బృందానికి వారి సొంతగడ్డపైనే ఝలక్‌ ఇచ్చింది. భారీ స్కోరు ఛేదనలో వైభవ్‌ (16 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 43) మెరుగైన పునాది వేయగా.. చివర్లో ఒత్తిడిని తట్టుకుని ఫెరీరా (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 52 నాటౌట్‌) చెలరేగాడు. దీంతో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగులు చేసింది. స్టొయినిస్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 నాటౌట్‌), ప్రభ్‌సిమ్రన్‌ (44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 59), కూపర్‌ (14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 30), శ్రేయాస్‌ (27 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో 30) రాణించారు. యష్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో రాజస్థాన్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగులు చేసి గెలిచింది. జైస్వాల్‌ (27 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 51), శుభమ్‌ (12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 నాటౌట్‌) వేగం కనబర్చారు. చాహల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఫెరీరా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు

మెరుపు ఆరంభం

భారీ ఛేదనలో ఓపెనర్‌ వైభవ్‌ బాదుడుకు రాజస్థాన్‌ స్కోరుబోర్డు దూసుకెళ్లింది. తొలి ఓవర్‌లో 6,4,4.. రెండో ఓవర్‌లో 4,6,6తో అదుర్స్‌ అనిపించాడు. అయితే హాఫ్‌ సెంచరీ ఖాయమనుకున్న వేళ నాలుగో ఓవర్‌లో వైభవ్‌ను అర్ష్‌దీప్‌ దెబ్బతీశాడు. దీంతో తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ అదే ఓవర్‌లో జైస్వాల్‌ 4,6,4తో చెలరేగి 22 రన్స్‌ అందించాడు. ఫెర్గూసన్‌ ఓవర్‌లోనూ జురెల్‌ (16) 6, జైస్వాల్‌ 4,4తో పవర్‌ప్లేలో ఆర్‌ఆర్‌ 84/1 స్కోరుతో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత స్పిన్నర్లు బ్రార్‌, చాహల్‌ కట్టుదిట్టం చేయడంతో 17 బంతుల వరకు ఫోర్‌ కూడా రాలేదు. దీనికి తోడు వరుస ఓవర్లలో జురెల్‌ను, హాఫ్‌ సెంచరీతో ఊపు మీదున్న జైస్వాల్‌ను చాహల్‌ వెనక్కి పంపాడు. అటు పరాగ్‌ (29) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో రాజస్థాన్‌ ఒక్కసారిగా వెనుకబడింది. ఈ స్థితిలో ఫెరీరా, శుభమ్‌ జోడీ జట్టును నిలబెట్టింది. 18 బంతుల్లో 35 పరుగులు కావాల్సిన వేళ ఫెరీరా బ్యాట్‌ ఝుళిపించాడు. ఎడాపెడా బౌండరీలతో ఆఖరి ఓవర్‌లో కేవలం 2 పరుగులే అవసరమయ్యే స్థితికి తెచ్చి సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఐదో వికెట్‌కు ఫెరీరా-శుభమ్‌ జోడీ అజేయంగా 77 పరుగులు జత చేయడం విశేషం.


8-Sports.jpg

స్టొయినిస్‌ మెరుపులు

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ తమ సహజశైలిలోనే ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. బరిలోకి దిగిన ప్రతీ బ్యాటర్‌ పరుగులు జత చేశారు. ఆరంభంలో ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌, ప్రియాన్ష్‌ ధాటిగా ఆడగా.. చివర్లో స్టొయినిస్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆఖరి 3 ఓవర్లలో 55 పరుగులు సమకూరాయి. ప్రియాన్ష్‌ రెండో ఓవర్‌లోనే 4,6,4,4తో 21 రన్స్‌ అందించాడు. కానీ ఆ తర్వాతి ఓవర్‌లోనే రెండు ఫోర్లు బాదిన ఆర్యను ఆర్చర్‌ అవుట్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో పవర్‌ప్లేలో జట్టు 65/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. మరో ఎండ్‌లో కూపర్‌ స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని యష్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లు, జడేజా ఓవర్‌లో 6,4తో పరుగుల వేగం పెంచాడు. కానీ యష్‌ ఓవర్‌లో భారీ షాట్‌కు వెళ్లిన అతడు లాంగా్‌ఫలో ఫెరీరాకు క్యాచ్‌ ఇచ్చాడు. రెండో వికెట్‌కు వీరి మధ్య 59 పరుగులు సమకూరాయి. అటు నిలకడగా ఆడిన ప్రభ్‌ 35 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. కాసేపటికే అతడిని కూడా యష్‌ దెబ్బతీశాడు. ఈ దశలో కెప్టెన్‌ శ్రేయాస్‌ నిదానంగా ఆడినా.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన మార్కస్‌ స్టొయినిస్‌ బౌండరీలతో చెలరేగాడు. 18వ ఓవర్‌లో స్టొయినిస్‌ 6,4తో ఆకట్టుకోగా.. శ్రేయాస్‌ అయ్యర్‌ కీపర్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో నాలుగో వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మార్కస్‌ మాత్రం ఆర్చర్‌ ఓవర్‌లో రెండు సిక్సర్లతో రన్‌రేట్‌ తగ్గకుండా చూశాడు. అలాగే ఆఖరి ఓవర్‌లో మరింతగా చెలరేగి 4,6,6,4,4తో 24 రన్స్‌ సాధించడమే కాకుండా 20 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీని సైతం పూర్తి చేశాడు. అటు స్కోరు కూడా 220 దాటేయగా, ఐదో వికెట్‌కు సుయాన్ష్‌ (3 నాటౌట్‌)తో కలిసి అజేయంగా 41 పరుగులు జత చేరాయి.


స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) పరాగ్‌ (బి) యష్‌ 59, ప్రియాన్ష్‌ (సి) బర్గర్‌ (బి) ఆర్చర్‌ 29, కూపర్‌ (సి) ఫెరీరా (బి) యష్‌ 30, శ్రేయాస్‌ (సి) జురెల్‌ (బి) బర్గర్‌ 30, స్టొయినిస్‌ (నాటౌట్‌) 62, సుయాన్ష్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 222/4; వికెట్ల పతనం: 1-37, 2-96, 3-144, 4-181. బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-40-1, బర్గర్‌ 4-0-59-1, బ్రిజేశ్‌ 4-0-42-0, యష్‌ 4-0-41-2, జడేజా 4-0-32-0.

రాజస్థాన్‌: జైస్వాల్‌ (సి) సూర్యాంశ్‌ (బి) చాహల్‌ 51, వైభవ్‌ (సి) శ్రేయాస్‌ (బి) ఆర్ష్‌దీప్‌ 43, జురెల్‌ (సి) యాన్సెన్‌ (బి) చాహల్‌ 16, పరాగ్‌ (సి) సూర్యాంశ్‌ (బి) చాహల్‌ 29, ఫెరీరా (నాటౌట్‌) 52, శుభమ్‌ (నాటౌట్‌) 31; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.2 ఓవర్లలో 228/4. వికెట్ల పతనం: 1-51, 2-105, 3-123, 4-151; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-68-1, ఫెర్గూసన్‌ 4-0-57-0, యాన్సెన్‌ 3.2-0-41-0, హర్‌ప్రీత్‌ 4-0-25-0, చాహల్‌ 4-0-36-3.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 8 6 1 1 13 1.043

బెంగళూరు 8 6 2 0 12 1.919

రాజస్థాన్‌ 9 6 3 0 12 0.617

హైదరాబాద్‌ 8 5 3 0 10 0.815

గుజరాత్‌ 8 4 4 0 8 -0.475

చెన్నై 8 3 5 0 6 -0.121

ఢిల్లీ 8 3 5 0 6 -1.060

కోల్‌కతా 8 2 5 1 5 -0.751

ముంబై 7 2 5 0 4 -0.736

లఖ్‌నవూ 8 2 6 0 4 -1.106

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు

మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ

Updated Date - Apr 29 , 2026 | 02:06 AM