జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:01 PM
భారత రెజ్లింగ్ సమాఖ్య ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జరుగుతున్న జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల నుంచి ఓ మహిళా రెజ్లర్‌ను తొలగించింది. ఆమె తండ్రి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రెండు జనన ధ్రువీకరణ పత్రాలను సమర్పించడంతో.. అండర్ 17 రెజ్లర్‌ను పోటీలో పాల్గొనకుండా అడ్డుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత రెజ్లింగ్ సమాఖ్య ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జరుగుతున్న జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల నుంచి ఓ మహిళా రెజ్లర్‌ను తొలగించింది. ఆమె తండ్రి వేర్వేరు రాష్ట్రాలకు చెందిన రెండు జనన ధ్రువీకరణ పత్రాలను సమర్పించడంతో.. అండర్ 17 రెజ్లర్‌ను పోటీలో పాల్గొనకుండా అడ్డుకుంది. మధ్యప్రదేశ్ తరఫున మహిళల 57 కేజీల విభాగంలో పాల్గొంటున్న సదరు మహిళా రెజ్లర్ జనన వ్యత్యాసాలను గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అండర్ 17కు ప్రాతినిధ్యం వహించాల్సిన మహిళా రెజ్లర్ మొదట మధ్యప్రదేశ్‌లోని అధికారులు జారీ చేసిన ఒక జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారు. అందులో ఆమె పుట్టిన తేదీ ఆగస్టు 26, 2010గా ఉండగా, సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నవంబర్ 16, 2021గా ఉంది. పుట్టిన పదేళ్ల తర్వాత సర్టిఫికెట్ తీసుకున్నట్లు ఉండటంతో అధికారులు ఆమెను పోటీల్లోకి అనుమతించకుండా పరిశీలనలో ఉంచారు. ఈ విషయంపై రెజ్లర్ తండ్రిని ప్రశ్నించగా.. ఆయన రాజస్థాన్‌కు చెందిన మరో జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించారు.
అందులోనూ పుట్టిన తేదీ ఆగస్టు 26, 2010 అని ఉండగా.. సర్టిఫికెట్ కోసం రిజిస్టర్ చేసుకున్న తేదీ సెప్టెంబర్ 1, 2010గా చూపించింది. ఆ ధ్రువపత్రాన్ని ఏప్రిల్ 2025లో జారీ చేసినట్లు ఉంది. రెండు సర్టిఫికెట్లలో తేడాలు ఉండటంతో ఆమె కుటుంబసభ్యులను అధికారులు ప్రశ్నించారు. వారు పుట్టిన తేదీలో ఎటువంటి లోపాలు లేవని వాదించారు. తమ కుటుంబం వేరే చోటుకు మారిన తర్వాత.. ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేందుకు వీలుగా మధ్యప్రదేశ్ నుంచి కొత్త సర్టిఫికెట్ తీసుకున్నట్లు తెలిపారు. అసలు రికార్డులను తనిఖీ చేయకుండా మరో రాష్ట్రం రెండో సర్టిఫికెట్‌ను ఎలా జారీ చేస్తుందని ప్రశ్నిస్తూ.. సదరు మహిళా రెజ్లర్ పోటీల్లో పాల్గొనడానికి రెజ్లింగ్ సమాఖ్య అనుమతించలేదు.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ కోసం కన్నీరు పెట్టుకున్న బాలుడు.. వీడియో వైరల్
ఓటమిపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని.. పోస్ట్ వైరల్!