Share News

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:28 PM

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో వాంఖడే వేదికగా ఎస్ఆర్‌హెచ్‌తో ఎంఐ తలపడనుంది. ఈ మ్యాచులోనైనా ముంబై పుంజుకుంటుందా? అనేది చూడాల్సి ఉంది.

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?
Mumbai Indians

ఇంటర్నెట్ డెస్క్: ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్.. జట్టు నిండా స్టార్ ప్లేయర్లు.. కానీ మ్యాచ్ గెలవడానికి మాత్రం తీవ్రంగా శ్రమిస్తోంది. అదే ముంబై ఇండియన్స్ జట్టు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే 220 టార్గెట్‌ను ఛేదించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన ముంబై.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. అందులోనూ రెండు మ్యాచుల్లో ఓ మోస్తరు లక్ష్యాలను కూడా ఛేదించలేక చేతులెత్తేయడం గమనార్హం. నాలుగు వరుస ఓటముల తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో ఏకంగా 99 పరుగుల తేడాతో గెలిచేసింది. మళ్లీ ఎంఐ పుంజుకుంది.. ఆరో టైటిల్ మనదే అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అదీ ముణ్నాళ్ల ముచ్చటే అయింది. ఆ తర్వాత సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. ఇలాంటి కష్టకాలంలో ముంబై మరో సమరానికి సిద్ధమైంది. అదీనూ వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి రెట్టింపు ఉత్సాహంతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వాంఖడే వేదికగా తలపడనుంది. మరి ఎంఐ ఈ మ్యాచ్‌లోనైనా పుంజుకుంటుందా?


ఎంఐకి అసలేమైంది..?

కెప్టెన్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. బౌలింగ్‌లో ప్రధాన అస్త్రంగా భావించిన బుమ్రా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదు. బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అస్థిర ప్రదర్శన కూడా సమస్యగా మారింది. గాయంతో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరమవ్వగా, మరో స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ గాయంతో ఐపీఎల్ టోర్నీ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ కేశవ మహరాజ్ వచ్చినప్పటికీ.. అద్భుత ప్రదర్శన చేస్తాడనే నమ్మకం లేదు. ఎంఐ ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే. అలా అయితేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. నేడు వాంఖడేలో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఐ ఓడితే.. ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు అయినట్లే!


హైదరాబాద్.. జోరుగా!

ఆరంభంలో కాస్త తడిబడినా ఆ తర్వాత బలంగా పుంజుకుని అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది సన్‌రైజర్స్ హైదరాబాద్. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అయితే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావడం ఎస్ఆర్‌హెచ్‌కు ప్లస్ అయింది. బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ బౌలింగ్ విభాగంలో హైదరాబాద్ తేలిపోతుందనే విమర్శలకు కూడా చెక్ పడింది. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఎషాన్ మలింగ్ వంటి బౌలర్లు చెలరేగి ఆడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఎంఐ గెలవాలంటే బౌలర్లు ఫామ్ అందుకోవాల్సిందే. బుమ్రా, బౌల్ట్ వంటి బౌలర్లు హైదరాబాద్ టాపార్డర్‌ను పడగొట్టగలిగితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తంగా ఎంఐకి ఇది చావో రేవో లాంటి మ్యాచ్. హైదరాబాద్‌తో జరిగే ఈ కీలక పోరులో ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్: ఐదో స్థానానికి పడిపోయిన స్మృతి మంధాన

మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం: శ్రేయస్ అయ్యర్

Updated Date - Apr 29 , 2026 | 12:28 PM