టీమిండియాలోకి నయా పేస్ సంచలనం.. అసలెవరీ గుర్నూర్ బ్రార్?
ABN , Publish Date - May 19 , 2026 | 08:41 PM
భారత టెస్టు, వన్డే జట్లను మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. అందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.. పంజాబ్‌కు చెందిన పేసర్ గుర్నూర్ బ్రార్. అఫ్గాన్‌తో ఆడే టెస్టు, వన్డే మ్యాచ్‌లతో బ్రార్ టీమిండియాలో అరంగ్రేటం చేయనున్నాడు. అసలు ఎవరీ గుర్నూర్ బ్రార్..?
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. జూన్ 6న అఫ్గాన్‌తో టీమిండియా ఏకైక టెస్టు.. జూన్ 14,17,20 తేదీల్లో మూడు వన్డేలు ఆడనుంది. దీనికి సంబంధించిన భారత టెస్టు, వన్డే జట్లను మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తోన్న యువ ప్లేయర్లకు బీసీసీఐ భారత జట్టులో చోటు కల్పించింది. అందులో ముఖ్యంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.. పంజాబ్‌కు చెందిన పేసర్ గుర్నూర్ బ్రార్. అఫ్గాన్‌తో ఆడే టెస్టు, వన్డే మ్యాచ్‌లతో బ్రార్ టీమిండియాలో అరంగ్రేటం చేయనున్నాడు. అసలు ఎవరీ గుర్నూర్ బ్రార్..?
పంజాబ్‌కు చెందిన బ్రార్.. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతడికి రాలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో చూపిన నిలకడైన ప్రదర్శన అతడికి జాతీయ జట్టు తలుపులు తెరిచేలా చేసింది. బ్రార్ 2022లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కాగా 2024-2025 సీజన్‌తో అతడి కెరీర్ కీలక మలుపు తిరిగింది. బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టీ20ల్లోనూ గుర్నూర్ బ్రార్ దూకుడు కొనసాగించాడు. షేర్-ఏ-పంజాబ్ టీ20 లీగ్‌లో 11 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఐపీఎల్ ప్రయాణం ఇలా..
ఐపీఎల్‌లో కూడా బ్రార్ ప్రయాణం ఆసక్తికరంగానే సాగింది. 2019లో ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ అరంగ్రేటం చేశాడు. తర్వాత దేశీయ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శనలతో చేసి ఐపీఎల్ ఫ్రాంచైజీ దృష్టిలో పడ్డాడు. 2025 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్రార్‌ను రూ.1.3కోట్లకు కొనుగోలు చేసింది.
గిల్ నా టాలెంట్‌ను గుర్తించాడు: బ్రార్
భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి బ్రార్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘అండర్ 19లో ఆడుతున్న నాటి నుంచే గిల్‌కు బౌలింగ్ చేసేవాడిని. నా బౌలింగ్ తీరు మెచ్చి జిల్లా జట్టులో అవకాశం రావడానికి సహకరించాడు’ అని తెలిపాడు. దేశవాళీ క్రికెట్ స్థాయి నుంచి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న బ్రార్ ప్రదర్శన ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
సీఎస్కేకి కెప్టెన్సీ చేయడం అంత సులభం కాదు: అశ్విన్
వచ్చే సీజన్‌లోనైనా ధోని ఆడుతాడా? సీఎస్కే కోచ్ రియాక్షన్ ఇదే