సీఎస్కేకి ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్స్.. అలా జరగడం సాధ్యమేనా?
ABN , Publish Date - May 19 , 2026 | 03:56 PM
ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే మూడు జట్లు అర్హత సాధించగా.. నాలుగో స్థానం కోసం పోటీ నెలకొంది. లీగ్ స్టేజ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరొక్క మ్యాచ్ మాత్రమే ఆడనుంది. అయినప్పటికీ సీఎస్కేకి ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అదెలాగంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యాయి. అయితే నాలుగో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. సన్‌రైజర్స్‌పై ఓటమి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సీఎస్కే.. సులువుగా ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందని అభిమానులు భావించారు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. దీంతో చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. లీగ్ స్టేజ్‌లో కేవలం మరొక్క మ్యాచ్‌లోనే సీఎస్కే తలపడనుంది. అయినప్పటికీ సీఎస్కేకి ప్లే ఆఫ్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అదెలాగంటే..
13 మ్యాచులు ఆడిన సీఎస్కే.. 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. లీగ్ స్టేజ్‌లో మరొక్క మ్యాచ్ మాత్రమే ఉండటంతో గరిష్ఠంగా 14 పాయింట్ల వరకు మాత్రమే చేరే అవకాశం ఆ జట్టుకు ఉంటుంది. కానీ ఆ పాయింట్లు ప్లే ఆఫ్స్ బెర్తుకు హామీ ఇవ్వలేవు. ముందుగా సీఎస్కే చేయాల్సిన అత్యంత కీలకమైన పని.. మే 21న గుజరాత్ టైటాన్స్‌పై ఘన విజయం సాధించడమే. మెరుగైన నెట్‌రన్ రేట్ కూడా అత్యవసరం. జీటీపై సీఎస్కే ఓడితే.. టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. గెలిస్తే 14 పాయింట్లతో రేసులో నిలిచే అవకాశం ఉంటుంది.
ఇతర జట్లపై ఆధారపడాల్సిందే..
సీఎస్కేకు జీటీపై విజయం ఒక్కటే సరిపోదు. ఇతర జట్ల ఫలితాలు కూడా తమకు అనుకూలంగా రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోవాలి. అలా జరిగితే పంజాబ్ 13 పాయింట్లకే పరిమితమవుతుంది. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు కూడా ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. రాజస్థాన్, కేకేఆర్ తలో రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా, డీసీ ఒక మ్యాచ్ ఆడనుంది. ఈ మూడు జట్లు ఆడే ప్రతి మ్యాచులోనూ ఓడిపోవాలి. మరోవైపు ఈ జట్లు 14 పాయింట్లతో సమానంగా నిలిస్తే అప్పుడు పోటీ అంతా నెట్ రన్‌రేట్ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పటికే లఖ్‌నవూ, సన్‌రైజర్స్ చేతిలో పరాజయాలతో సీఎస్కే రన్ రేట్ దెబ్బతింది. అందుకే గుజరాత్‌పై భారీ తేడాతో గెలవడం ఇప్పుడు చెన్నైకి అత్యవసరంగా మారింది. సీఎస్కే ప్లేఆఫ్స్ కల నెరవేరాలంటే ఇక మైదానంలో విజయం మాత్రమే కాదు... అదృష్టం కూడా కలిసి రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
సీఎస్కేకి కెప్టెన్సీ చేయడం అంత సులభం కాదు: అశ్విన్
వచ్చే సీజన్‌లోనైనా ధోని ఆడుతాడా? సీఎస్కే కోచ్ రియాక్షన్ ఇదే