Share News

నా కొడుకు స్విమ్మింగ్ కెరీర్ కోసం దుబాయ్ షిఫ్ట్ అయ్యాం: మాధవన్

ABN , Publish Date - May 19 , 2026 | 05:21 PM

నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే వేదాంత్ భవిష్యత్తు కోసం తన కుటుంబం తీసుకున్న కీలక నిర్ణయంపై నటుడు మాధవన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

నా కొడుకు స్విమ్మింగ్ కెరీర్ కోసం దుబాయ్ షిఫ్ట్ అయ్యాం: మాధవన్
R Madhavan

ఇంటర్నెట్ డెస్క్: నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌లో రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన జూనియర్ నేషనల్ ఆక్వాటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో వేదాంత్ నాలుగు స్వర్ణాలు, మూడు రజత పతకాలు సాధించాడు. మలేషియన్ ఓపెన్‌లో భారత్ తరఫున ఐదు స్వర్ణ పతకాలు గెలిచి తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే కొడుకు భవిష్యత్తు కోసం తన కుటుంబం తీసుకున్న కీలక నిర్ణయంపై నటుడు మాధవన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. స్విమ్మింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న వేదాంత్ కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో.. కరోనా సమయంలో దుబాయ్‌కు షిఫ్ట్ అయినట్లు మాధవన్ తెలిపారు.


‘కరోనా లాక్‌డౌన్ సమయంలో ముంబై సహా దేశవ్యాప్తంగా స్మిమ్మింగ్ పూల్స్ మూతపడటంతో వేదాంత్ శిక్షణకు అంతరాయం ఏర్పడింది. ఎదుగుదల దశలో ఉన్న సమయంలో ప్రాక్టీస్ ఆగిపోతే వేదాంత్ అంతర్జాతీయ స్విమ్మింగ్ కెరీర్‌కే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావించాం. అదే సమయంలో జర్మనీ, ఫ్రాన్స్, చైనా వంటి దేశాలు క్రీడాకారుల కోసం ప్రత్యేక భద్రతా చర్యలతో స్మిమ్మింగ్ పూల్స్ ప్రారంభించాయి. దుబాయ్‌లో కూడా కఠిన నిబంధనలతో ప్లేయర్లకు శిక్షణ ఇస్తున్నారని తెలుసుకున్నాం. దీంతో దుబాయ్‌కి మాకాం మార్చాలని నిర్ణయించుకున్నాం. వెంటనే నా భార్య సరిత, కొడుకు వేదాంత్ దుబాయ్ వెళ్లారు. ఆ తర్వాత నేను కూడా అక్కడికి వెళ్లిపోయాను. మేము దుబాయ్‌కు షిఫ్ట్ అవ్వడం వేదాంత్ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది’ అని మాధవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.


ఈ గుర్తింపు శాశ్వతం కాదు..

‘నా బిజీ షెడ్యూల్ కారణంగా వేదాంత్‌తో పూర్తిగా సమయం కేటాయించలేకపోతున్నాను. నా భార్య సరితనే అతడి విషయంలో ఎక్కువగా బాధ్యత తీసుకుంటుంది. కొన్నిసార్లు మాత్రమే నా సలహాలు ఇస్తుంటాను. అయితే వేదాంత్ చిన్న వయసులోనే ఎక్కువ గుర్తింపు పొందడం నాకు కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ గుర్తింపు శాశ్వతం కాదు. ఇది జీవితంలో ఒక దశ మాత్రమే. అది అర్థం చేసుకునేంత పరిపక్వత అతడిలోనే ఉండాలి’ అని మాధవన్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌: భారత వన్డే, టెస్టు జట్ల ప్రకటన

సీఎస్కేకి ఇంకా ప్లే ఆఫ్స్ ఛాన్స్.. అలా జరగడం సాధ్యమేనా?

Updated Date - May 19 , 2026 | 05:21 PM