Share News

అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:39 PM

భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ బ్యాటర్ వింత ఔట్ అయ్యాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులో రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు

అఫ్గాన్ బ్యాటర్ వింత ఔట్.. అసలేమిటీ ఆబ్సెంట్ హర్ట్?
Absent Hurt

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్.. ఇదో మహాసముద్రం. ఇందులో చాలా పదాలు అభిమానులకు అర్థంకానివి ఉంటాయి. క్యాచ్ ఔట్, రనౌట్, రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ అనే పదాలు తరచూ వింటూ ఉంటాం. అయితే భారత్‌తో జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ బ్యాటర్ వింత ఔట్ అయ్యాడు. ఫాలోఆన్‌లో అఫ్గాన్ 9 వికెట్లు కోల్పోయిన తర్వాత అంపైర్ ఆలౌట్ ప్రకటించాడు. ఆఖరి వికెట్‌గా క్రీజులోకి రావాల్సిన షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు. కాలి గాయంతో బాధపడుతున్న అష్రఫ్ ఆబ్సెంట్ హర్ట్ (ఏబీఎస్ హర్ట్) అయినట్లు అంపైర్ ప్రకటించాడు. దీంతో ఆబ్సెంట్ హర్ట్ అంటే ఏంటి అనే చర్చ మొదలైంది.


ఒక ఆటగాడు బ్యాటింగ్ చేసే అవకాశం రావడానికి ముందే.. అనారోగ్యం లేదా గాయం బారిన పడి బరిలోకి దిగకపోతే దీనిని ఏబీఎస్ హర్ట్‌గా సూచిస్తారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని నిరూపిస్తూ కంకషన్ అని ప్రకటిస్తే తప్ప.. అతడి స్థానంలో మరొక బ్యాటర్‌ను ఆడించేందుకు వీలు లేదు. ఆ సమయంలో సదరు జట్టు ఒక ప్లేయర్ లేకుండానే ఆటను కొనసాగించాల్సి వస్తుంది. అఫ్గాన్ బ్యాటర్ అష్రఫ్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జట్టు మేనేజ్‌మెంట్ అతడిని బ్యాటింగ్‌కు పంపలేదు. దీంతో తొమ్మిదో వికెట్ కోల్పోయిన అనంతరం అఫ్గానిస్థాన్ జట్టును ఆలౌట్‌గా అంపైర్లు ప్రకటించారు.


మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 564/8 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్థాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. అప్పటికి భారత్ 412 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండటంతో.. అఫ్గాన్‌తో ఫాలోఆన్ ఆడించింది. ఫాలోఆన్‌లోనూ అఫ్గాన్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. 112 పరుగులకే కుప్పకూలారు. దీంతో అఫ్గాన్‌పై భారత్ 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అరంగేట్రంలోనే అదరగొట్టారు. మొత్తంగా ఈ టెస్టులో 7 వికెట్లతో సత్తా చాటాడు.


ఇవి కూడా చదవండి:

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు: టీమిండియా ఘన విజయం

వైభవ్‌పై అంచనాలు పెంచుకోవద్దు: సౌరభ్ గంగూలీ

Updated Date - Jun 08 , 2026 | 07:00 PM