Share News

రిటైర్‌మెంట్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌కి కౌంటర్ ఇచ్చిన హర్మన్‌ప్రీత్!

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:48 PM

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు.

రిటైర్‌మెంట్‌పై ప్రశ్న.. రిపోర్టర్‌కి కౌంటర్ ఇచ్చిన హర్మన్‌ప్రీత్!
Harmanpreet Kaur

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవలే అన్ని జట్ల కెప్టెన్లతో ఫొటోషూట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను విలేకరులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో తన రిటైర్‌మెంట్‌పై ఎదురైన ఓ ప్రశ్నకు హర్మన్.. దీటుగా సమాధానం ఇచ్చింది.


‘ఈ టీ20 ప్రపంచ కప్ మీకు చివరది అవుతుందా?’ అంటూ ఓ రిపోర్టర్ హర్మన్‌ను ప్రశ్నించాడు. దీనికి సరదాగా స్పందించిన ఆమె.. ‘నేను ఆడటం ఆపేయాలని మీరు అనుకుంటున్నారా?’ అని ఎదురు ప్రశ్న వేసింది. దీనికి ఆ రిపోర్టర్..‘అలా కాదు.. కేవలం మీ ప్రణాళికలు తెలుసుకునేందుకు ఈ ప్రశ్న అడిగా. టీ20 నుంచి వైదొలగడానికి సమయం రాలేదని మీరు భావిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’ అని సమాధానమిచ్చాడు. అయినప్పటికీ హర్మన్ తగ్గలేదు. ‘మరి అలాంటప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది.


హర్మన్‌ప్రీత్ సారథ్యంలో టీమిండియా ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2025ను ముద్దాడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పొట్టి ప్రపంచ కప్‌లో భారత మహిళలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ విషయంపై కూడా హర్మన్ స్పందించింది. ‘వన్డే ప్రపంచ కప్ విజయంతో సహజంగానే మరిన్ని అంచనాలు వస్తాయి. కానీ మహిళల క్రికెట్‌కు ఇది సానుకూల సంకేతంగా చూస్తున్నాను. వ్యక్తిగతంగా నేను బయటి నుంచి వచ్చే ఒత్తిడి గురించి ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. జట్టు బాగా ఆడితే చాలా విషయాలు మారుతాయి. ఈ ప్రపంచకప్‌లోనూ మా అత్యుత్తమ ఆటను ప్రదర్శించి మహిళల క్రికెట్‌పై మరింత ప్రభావం చూపాలని ఆశిస్తున్నాం’ అని హర్మన్ వెల్లడించింది.


ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026‌లో భారత్ జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం జూన్ 17న టోర్నీలో అరంగేట్రం చేస్తున్న నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. భారత్ ఉన్న గ్రూపులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మాత్రమే సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.


ఇవి కూడా చదవండి:

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు: టీమిండియా ఘన విజయం

వైభవ్‌పై అంచనాలు పెంచుకోవద్దు: సౌరభ్ గంగూలీ

Updated Date - Jun 08 , 2026 | 06:03 PM