అప్పట్లో నాకు ఆర్సీబీలో చేరాలనే ఆసక్తే లేదు: రజత్ పాటీదార్
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:27 PM
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదట్లో ఆర్సీబీలో చేరాలనే ఆసక్తే లేదని వెల్లడించాడు. రీప్లేస్‌మెంట్‌గా ప్లేయర్‌గా తీసుకోవడంతో బెంచ్‌పైనే కూర్చోవాల్సి వస్తుందని భావించినట్లు తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. డిఫెండింగ్ కాదు అటాకింగ్ ఛాంపియన్స్ అంటూ ఈ ఏడాది బరిలోకి దిగిన ఆర్సీబీ.. అదే దూకుడును కొనసాగించి వరుసగా రెండోసారి కప్పును సొంతం చేసుకుంది. రీప్లేస్‌మెంట్‌గా జట్టులోకి వచ్చిన రజత్ పాటీదార్.. అద్భుత ప్రదర్శనలతో ఆర్సీబీకి కెప్టెన్ అయ్యాడు. జట్టు పగ్గాలు అందుకున్న తొలి సీజన్‌లోనే జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. వరుసగా రెండుసార్లు ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే రజత్ పాటీదార్ ఆర్సీబీతో తన ప్రయాణం గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
‘నిజం చెప్పాలంటే.. మొదట్లో ఆర్సీబీలో చేరాలని నేను అనుకోలేదు. రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా పిలిచారు కాబట్టి ఆడే అవకాశం రావడం కష్టమేనని భావించాను. జట్టులో చేరిన తర్వాత కూడా నాకు అదే విషయం చెప్పారు. ‘నువ్వు రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌వి. ఎవరైనా గాయపడితే తప్ప నీకు అవకాశం రావడం కష్టం. అప్పటి వరకు రిలాక్స్ అవ్వు’ అని స్పష్టం చేశారు. అందుకే ఆర్సీబీ జట్టులో చేరడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. అప్పుడే నా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది. బెంచ్‌పైనే ఉండాలని తెలిసినప్పుడు ఎందుకు వెళ్లడం అనిపించింది. కట్ చేస్తే.. రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గానే ఆడాను. నా సత్తా ఏంటో నిరూపించుకున్నాను’ అని పాటీదార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఐపీఎల్ 2021 మినీ వేలంలో రూ.20 లక్షలకు ఆర్సీబీ రజత్‌ను కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం 71 పరుగులే చేశాడు. ఐపీఎల్ 2022 వేలంలో అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఆర్సీబీ రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా పాటీదార్‌ను ఎంపిక చేసింది. ఆ సీజన్‌లో అనూహ్యంగా ఆర్సీబీ ప్లేయర్ సిసోడియా గాయపడటంతో అతడిని జట్టులోకి తీసుకున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న పాటీదార్.. అదే సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీపై అజేయ శతకం (112*) బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2025 ఐపీఎల్ మెగా వేలం అనంతరం ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పాటీదార్.. ఫ్రాంచైజీ చరిత్రలో తొలి ఐపీఎల్ టైటిల్ అందించిన సారథిగా నిలిచాడు. ఆ తర్వాత 2026లోనూ జట్టును విజేతగా నిలిపి ఆర్సీబీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు: టీమిండియా ఘన విజయం
వైభవ్‌పై అంచనాలు పెంచుకోవద్దు: సౌరభ్ గంగూలీ