వైభవ్‌పై అంచనాలు పెంచుకోవద్దు: సౌరభ్ గంగూలీ
ABN , Publish Date - Jun 08 , 2026 | 03:09 PM
ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు రానున్న ఆసియా గేమ్స్ 2026కు సంబంధించిన భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు రానున్న ఆసియా గేమ్స్ 2026కు సంబంధించిన భారత టీ20 జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టిన అతడు.. 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే భారత జట్టులోకి ఎంట్రీ ఇస్తున్న ఈ కుర్రాడిపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌పై అతిగా అంచనాలు పెట్టుకోవద్దని అభిమానులకు సూచించాడు.
‘వైభవ్‌ను తన దారిలోనే వెళ్లనివ్వాలి. అతడి నుంచి ఇప్పుడే అద్భుతాలు ఆశించకండి. భారత జట్టులో స్థిరపడేందుకు వైభవ్‌కు కాస్త సమయం ఇవ్వాలి. అతడిలో అపార ప్రతిభ ఉంది. వైభవ్‌కు ఇప్పుడు కేవలం 15 ఏళ్లే. ఒత్తిడి అంటే ఏంటో కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని వయసు. ఐపీఎల్‌లో కూడా ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆడిన తీరు నన్ను ఆకట్టుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. భారత్ తరఫున స్వదేశంలో ఆడటం వేరు. విదేశాల్లో వికెట్లు భిన్నంగా ఉంటాయి. బంతికి ఎక్కువ సీమ్, బౌన్స్ ఉంటుంది. కాబట్టి ఆట కూడా మారుతుంది. అయినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొనే సత్తా వైభవ్‌కు ఉంది’ అని గంగూలీ వెల్లడించాడు.
ఇటీవల ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో వైభవ్‌కు అవకాశం లభించింది. అలాగే 2026 ఆసియా క్రీడల కోసం ఎంపికైన భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌లో వైభవ్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఓపెనర్ స్థానం కోసం అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్‌లతో వైభవ్ పోటీ పడనున్నాడు.
ఈ వార్తలనూ చదవండి:
వైభవ్ ఏం చేస్తాడో.. నాకైతే డౌటే: ఏబీ డివిలియర్స్
విప్లవాత్మక మార్పులతో ఫీఫా వరల్డ్ కప్