గంభీర్‌ను తప్పించండి అంటూ వార్తలు.. కోచ్ పదవిపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:23 PM
గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. దీంతో గంభీర్‌ను తప్పించి లక్ష్మణ్‌ను పూర్తి స్థాయి కోచ్‌గా నియమించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో భారత హెడ్ కోచ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్‌కు రెస్ట్ ఇవ్వడంతో.. వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. గంభీర్ నేతృత్వంలో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో సిరీస్‌లు కోల్పోయిన టీమిండియా.. లక్ష్మణ్ నేతృత్వంలో అద్భుత ప్రదర్శన కనబర్చింది. దీంతో గంభీర్‌ను తప్పించి లక్ష్మణ్‌ను పూర్తి స్థాయి కోచ్‌గా నియమించాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు మొదలయ్యాయి. అయితే ఈ విషయంపై వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు.
‘ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్, ప్రధాన కోచింగ్ సిబ్బంది కొద్దిరోజుల విరామం తీసుకున్నారు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు అందుబాటులో వస్తారు. ఆ కారణంగానే నేను తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టాను. నాలుగేళ్లుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్‌గా ఉన్న నేను.. అవసరమైనప్పుడు భారత జట్టుతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటాను. గంభీర్‌ను తప్పించాలని వస్తోన్న డిమాండ్లలో అర్థం లేదు. అలాంటి వార్తలకు ప్రాధాన్యమే ఉండదు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పని చేయడం వల్ల యువ క్రికెటర్లు, సీనియర్లు అందరితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తోంది. నాకు అదే ఎంతో సంతృప్తిని ఇస్తోంది’ అని లక్ష్మణ్ వివరించాడు.
అందుకే బీసీసీఐకి ట్రబుల్‌షూటర్
ఐర్లాండ్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనల్లో తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించిన ప్రతిసారీ లక్ష్మణ్ భారత్‌కు సిరీస్ విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2023 ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టుకు స్వర్ణ పతకం కూడా అందించాడు. అందుకే సీనియర్ జట్టు, రెండో జట్టు షెడ్యూల్ ఒకేసారి ఉన్నప్పుడు బీసీసీఐ మొదటి ఎంపికగా లక్ష్మణ్‌ను నియమిస్తూ వస్తోంది. 2026 ఆసియా క్రీడల్లోనూ లక్ష్మణ్ బాధ్యతలు నిర్వర్తించే అవకాశముంది. అయితే జింబాబ్వే సిరీస్ తర్వాత ఎంత చర్చ జరిగినా, భారత జట్టు పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌నే కొనసాగనున్నట్లు లక్ష్మణ్ స్పష్టం చేయడంతో ఊహాగానాలకు తెరపడింది.
ఇవి కూడా చదవండి:
పాక్‌పై సాధించిన నా విజయం కార్గిల్ వీరులకు అంకితం: జాదుమణి
వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్