పాక్‌పై సాధించిన నా విజయం కార్గిల్ వీరులకు అంకితం: జాదుమణి
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:13 AM
కామన్వెల్త్ గేమ్స్2026లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ అద్భుతం చేశాడు. పురుషుల 55 కేజీల విభాగంలో ఈ 22 ఏళ్ల బాక్సర్.. పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు ప్రవేశించాడు.
స్పోర్ట్స్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ (CWG 2026)లో భారత బాక్సర్ జాదుమణి సింగ్ (Jadumani Singh) సంచలన విజయం సాధించాడు. పురుషుల 55 కేజీల విభాగంలో ఈ 22 ఏళ్ల బాక్సర్.. పాకిస్థాన్ బాక్సర్ సుమామ రెహమాన్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్‌కు ప్రవేశించాడు. ఆదివారం రాత్రి జరిగిన రౌండ్16లో తన ప్రత్యర్థిపై 5-0 తేడాతో జాదుమణి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. దీంతో బాక్సింగ్ విభాగంలో భారతకు పతక ఆశలు సజీవంగా ఉన్నాయి. అయితే ఈ పోటీ కార్గిల్ విజయ్ దివస్(జులై 26) నాడు జరగడంతో..ఈ మణిపూర్ బాక్సర్ గెలుపు ప్రత్యేకంగా మారింది. ఆట ముగిసిన అనంతరం అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన సింగ్.. తన విజయాన్ని కార్గిల్ యుద్ధ వీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు.
‘నా విజయం మన కార్గిల్ హీరోలకు అంకితం. పాకిస్థాన్ బాక్సర్‌పై గెలవడం చాలా సంతోషంగా ఉంది. క్వార్టర్ ఫైనల్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేసి ముందుకు సాగుతాను. భారత్‌కు స్వర్ణ పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా’ అని జాదుమణి వెల్లడించాడు. 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ఏటా జులై 26న ‘కార్గిల్ విజయ్ దివస్’ను నిర్వహిస్తారు. ఇలాంటి రోజునే పాక్ బాక్సర్‌పై జాదుమణి విజయం సాధించడం విశేషం.
తొలి రౌండ్‌లో బై దక్కడంతో సుమామ రెహమాన్ ప్రిక్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. అయితే ప్రి క్వార్టర్స్‌లో జాదుమణి దెబ్బకు పాక్ బాక్సర్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. జాదుమణి జులై 28న క్వార్టర్ ఫైనల్‌లో సెమీ ఫైనల్ బెర్తు కోసం పోరాడుతాడు. క్వార్టర్ ఫైనల్‌లో గెలిస్తే జాదుమణికి కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. ఎందుకంటే కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్‌లో సెమీఫైనల్‌లో ఓడిపోయిన ఇద్దరికీ కాంస్య పతకాలు లభిస్తాయి.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్
'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!