Share News

ఎలా ఆడాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: సంజు శాంసన్

ABN , Publish Date - Jul 27 , 2026 | 02:36 PM

భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇకపై ఎవరి మాటలు పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగానే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.

ఎలా ఆడాలో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు: సంజు శాంసన్
Sanju Samson

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ సంజు శాంసన్ తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇకపై ఎవరి మాటలు పట్టించుకోకుండా తనకు నచ్చిన విధంగానే క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. ఎప్పుడూ జరిగే ‘రాట్ రేస్’లో తాను భాగం కానని, తన ఆట గురించి నిర్ణయాలు తానే తీసుకుంటానని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంజు.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


‘2026 టీ20 ప్రపంచ కప్‌కు ముందే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకపై పోటీలు, విమర్శలు, పోలికల గురించి ఆలోచించను. ఆటను ఆస్వాదిస్తూ నా శైలిలోనే ఆడతాను. నాకు ఎలా బ్యాటింగ్ చేయాలో, ఎలా ఆడాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. సంజు కోసం సంజూనే నిర్ణయాలు తీసుకుంటాడు. 2024 ప్రపంచ కప్ తర్వాత మళ్లీ 2026 వరల్డ్ కప్ ఆడతానని అనుకోలేదు. ఒక దశలో జట్టులోనే నాకు చోటు లేదు. అలాంటప్పుడు 2028లో జరిగే మెగా టోర్నీల గురించి ఎలా ఆలోచిస్తాను? జట్టుకు నేను అవసరమైతే, నా ఆట బాగుంటే అవకాశాలు వస్తాయి. లేకపోయినా ఇప్పటికే సాధించిన విజయాలపై నాకు గర్వమే’ అని సంజు తెలిపాడు.


కోహ్లీ ఇచ్చిన సలహా మర్చిపోలేను..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో జరిగిన ఓ సంభాషణ తనపై ఎంతో ప్రభావం చూపిందని సంజు వెల్లడించాడు. జాతీయ జట్టు శిబిరంలో ఇద్దరూ కలిసి జిమ్‌లో ఉన్న సమయంలో కోహ్లీని ఓ సలహా అడిగానని గుర్తు చేసుకున్నాడు. ‘విరాట్ భాయ్ తన జీవనశైలిపై చాలా స్పష్టంగా ఉంటాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎక్కువకాలం నిలవాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని నాకు చెప్పాడు. ఏ ఆహారం శరీరానికి మేలు చేస్తుంది.. ఫిట్‌గా ఉండాలంటే ఏం చేయాలి వంటి విషయాలపై విరాట్ భాయ్ నాకు సలహా ఇచ్చారు. దాదాపు ఏడాదిన్నర పాటు ఆయన చెప్పిన విధంగానే పాటించాను. కానీ ఆ తర్వాత అదే క్రమశిక్షణ కొనసాగించలేకపోయాను’ అని నవ్వుతూ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: వీవీఎస్ లక్ష్మణ్

'అనుభవమే అతిపెద్ద గుణపాఠం'.. ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ రజా వ్యాఖ్యలు!

Updated Date - Jul 27 , 2026 | 02:53 PM