Share News

వేలంలో చేసిన తప్పును అంగీకరించి గ్రీన్‌పై వేటు వేయండి.. కేకేఆర్‌కు సెహ్వాగ్ హెచ్చరిక

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:40 PM

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్.. ఈ సీజన్‌లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కేకేఆర్‌కు పలు సూచనలు చేశాడు.

వేలంలో చేసిన తప్పును అంగీకరించి గ్రీన్‌పై వేటు వేయండి.. కేకేఆర్‌కు సెహ్వాగ్ హెచ్చరిక
Virender Sehwag

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన కేకేఆర్.. ఈ సీజన్‌లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌పై 32 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది. దీంతో జట్టు వ్యూహాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ వేలంలోనే అత్యధిక ధర పలికిన ఆసీస్ స్టార్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. సీఎస్కేపై అతడు డకౌట్‌ అయిన నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కేకేఆర్ యాజమాన్యానికి గట్టి హెచ్చరిక జారీ చేశాడు.


‘ఏకంగా రూ.25.20 కోట్లు పెట్టి గ్రీన్‌ను కొనుగోలు చేశారు. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి తీసుకున్న ఆటగాడు ఇప్పుడు జట్టుకు భారంగా మారాడు. ఆడిస్తే రాణించడం లేదు. అలా అని బెంచ్‌పై పెడితే ఎందుకు కొనుగోలు చేశారనే ప్రశ్నలు వస్తాయి. అయినప్పటికీ వేలంలో కేకేఆర్ చేసిన తప్పును అంగీకరించి.. గ్రీన్‌పై వేటు వేయడంలో తప్పే లేదు. జరిగిందేదో జరిగిపోయింది.. మ్యాచ్‌లు గెలవడం ముఖ్యం. అంచనాలు పెట్టుకున్న ప్లేయర్ రాణించలేకపోతే.. మరొక ఆటగాడికి అవకాశం ఇవ్వాలి. గ్రీన్ బౌలింగ్ కూడా ఉపయోగపడటం లేదు. జట్టు కాంబినేషన్‌కూ అతడి వల్ల పెద్దగా లాభం లేదు’ అని సెహ్వాగ్ తెలిపాడు.


బ్యాటింగ్ లైనప్ మార్చాలి..

కేకేఆర్ జట్టు కూర్పుపై కూడా సెహ్వాగ్ పలు సూచనలు చేశాడు. ‘టిమ్ సీఫర్ట్‌ను జట్టులోకి తీసుకుని, ఫిన్ అలెన్‌తో కలిసి ఓపెనింగ్ చేయించాలి. కెప్టెన్ అజింక్య రహానెను నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలి. దీని ద్వారా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. వెంటనే జట్టులో మార్పులు చేసి, వ్యూహాలు మార్చాలి. కేకేఆర్‌ గెలుపు బాట పట్టాలి’ అని సెహ్వాగ్ తెలిపాడు. కేకేఆర్ తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 17న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

ధోని సూచనలతోనే నూర్ కాస్తా కోహి‘నూర్’గా మారాడు: సీఎస్కే బౌలింగ్ కోచ్

స్లో ఓవర్ రేట్: ప్లేయర్లకు కాదు.. అంపైర్లకు జరిమానా విధించాలి: ఎంసీసీ హెడ్ ఫ్రేజర్ స్టీవార్ట్

Updated Date - Apr 15 , 2026 | 04:41 PM