Share News

ధోని సూచనలతోనే నూర్ కాస్తా కోహి‘నూర్’గా మారాడు: సీఎస్కే బౌలింగ్ కోచ్

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:07 PM

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. సొంత మైదానం చెపాక్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 32 పరుగుల తేడాతో గెలిచింది. అయితే గత మ్యాచుల్లో పెద్దగా రాణించని సీఎస్కే స్టార్ బౌలర్ నూర్ అహ్మద్.. ఈసారి సత్తా చాటాడు.

ధోని సూచనలతోనే నూర్ కాస్తా కోహి‘నూర్’గా మారాడు: సీఎస్కే బౌలింగ్ కోచ్
Noor Ahmad

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. సొంత మైదానం చెపాక్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 32 పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్ ముందు 200 కంటే తక్కువ లక్ష్యం ఉంచి మరీ గెలవడం గమనార్హం. అయితే గత మ్యాచుల్లో పెద్దగా రాణించని సీఎస్కే స్టార్ బౌలర్ నూర్ అహ్మద్.. ఈసారి సత్తా చాటాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 21 పరుగుల మాత్రమే ఇచ్చి వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. అయితే నూర్ సూపర్ స్పెల్ వెనుక ధోని ఇచ్చిన సూచనలు కీలక పాత్ర పోషించాయని సీఎస్కే బౌలింగ్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్ వెల్లడించాడు.


‘పిచ్ చాలా బాగుంది. స్పిన్నర్లకు బాగా సహకారం లభించింది. ఇతర పిచ్‌లు కొంచెం ఫ్లాట్‌గా ఉంటాయి. కోల్‌కతాతో ఆడిన పిచ్ బెటర్. నూర్ అహ్మద్ ఈ మ్యాచ్ ముందు వరకూ పెద్దగా ప్రభావం చూపించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఎంఎస్ ధోనితో సుదీర్ఘంగా చర్చించాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో ధోని విలువైన సూచనలు ఇచ్చాడు. లెగ్ బ్రేక్‌కు సంబంధించి చేసిన సూచన ఈ మ్యాచ్‌లో బాగా ఉపయోగపడింది. ధోని చేసిన ఆ సూచనల వల్లే నూర్.. కేకేఆర్ మ్యాచ్‌లో కోహినూర్ అయ్యాడు’ అని శ్రీధరన్ తెలిపాడు.


అతడి బలం అదే..

‘నూర్ అహ్మద్‌కు మొదట్లో ఎక్కువ వికెట్లు రాకపోవడానికి ఫ్లాట్ పిచ్‌లూ ఓ కారణం. అలాంటివాటిపై ఎలాంటి బౌలింగ్ చేయాలనే దానిపై వర్కౌట్ చేస్తున్నాడు. తన తొలి ఓవర్లో షార్ట్ లేదా ఫుల్‌గా బంతిని విసరడం వల్ల కాస్త ఎక్కువగా పరుగులు ఇచ్చేశాడు. ఎప్పుడైతే లెంగ్త్‌ను సరిచేసుకుంటాడో.. అతడి బౌలింగ్‌ను ఆడటం కష్టంగా మారుతుంది. మరో స్పిన్నర్ అకీల్ కూడా మంచి బౌలింగ్ చేశాడు. నూర్ బలం బంతిని నెమ్మదిగా స్పిన్ చేయడం. బ్యాటర్ అనుకున్నంత వేగంగా బంతి రాదు. నిలకడగా బంతిని టర్న్ చేస్తే నూర్‌ను ఆడటం బ్యాటర్లకు చాలా కష్టం. నిరంతరం నేర్చుకునేందుకే అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు’ అని శ్రీధరన్ శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

అజింక్య రహానేకు దెబ్బ మీద దెబ్బ.. ఓటమే అనుకుంటే... మరో షాక్

ఆ చిట్కాతో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాను: నూర్ అహ్మద్

Updated Date - Apr 15 , 2026 | 04:07 PM