Share News

ఐపీఎల్ చరిత్రలోనే తొలి బ్యాటర్‌‌గా.. విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:00 PM

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ చరిత్రలోనే తొలి బ్యాటర్‌‌గా.. విరాట్ కోహ్లీ అరుదైన ఘనత
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. 15.4 ఓవర్లలోనే ఛేదించింది. ఈ గెలుపులో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ 69 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.


ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా.. ఛేదనలో 4వేలకుపైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను విరాట్ అధిగమించాడు. మాలిక్ 557 మ్యాచుల్లో 13,571 పరుగులు చేయగా.. విరాట్ 415 మ్యాచుల్లోనే 13,612 పరుగులు సాధించాడు.


రిటైర్‌మెంట్ వెనక్కి తీసుకోవాలి: అంబటి రాయుడు

విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఇప్పుడు మనం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఐపీఎల్‌లో అతడి నుంచి బెస్ట్ గేమ్ ఇంకా రాలేదనే చెబుతా. ఫిట్‌నెస్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికీ మైదానంలో చురుగ్గా ఉన్నాడు. అతడి అంతర్జాతీయ కెరీర్ కనీసం ఐదారేళ్లు ఉందని అనుకుంటున్నా. టెస్టుల్లోకి విరాట్ పునరాగమనం చేయాలి. కెప్టెన్సీ చేపట్టాలి. భారత క్రికెట్‌లో కోహ్లీ అత్యుత్తమ సారథి అని భావిస్తా’ అని రాయుడు వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

Updated Date - Mar 29 , 2026 | 04:07 PM