Share News

ఐపీఎల్ 2026: నేడు ముంబైతో మ్యాచ్.. భయంలో కేకేఆర్!

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:23 PM

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఇవాళ(ఆదివారం) ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య జరిగే మ్యాచ్‌కు వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఐపీఎల్ 2026: నేడు ముంబైతో మ్యాచ్.. భయంలో కేకేఆర్!
MI vs KKR 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPl) 2026 సీజన్‌లో భాగంగా ఇవాళ(ఆదివారం)ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) మధ్య జరిగే మ్యాచ్‌కు ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇటీవల భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 సెమీ-ఫైనల్ తర్వాత ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనున్న తొలి మ్యాచ్‌ ఇదే కావడం గమన్హారం. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఫేవ‌రెట్‌గా కనిపిస్తోంది. కేకేఆర్‌ను కూడా త‌క్కువ అంచ‌నా వేయ‌లేం.


ఈ రెండు జ‌ట్లలో కేకేఆర్‌పై ఒత్తిడి కాస్త ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే ముంబైని వారి సొంత గ్రౌండ్‌లో కేకేఆర్ ఇప్పటివ‌ర‌కు రెండుసార్లు మాత్రమే ఓడించ‌గలిగింది. వాంఖడేలో ఇరు జ‌ట్ల మ‌ధ్య 12 మ్యాచ్‌లు జ‌రిగితే 10 సార్లు ముంబై విజ‌యం సాధించింది. అయితే ఈసారి దానిని తిర‌గ‌రాసి విజ‌యంతో సీజ‌న్‌ను ప్రారంభించాలని కేకేఆర్ ఉవ్విళ్లూరుతోంది. మ‌రోవైపు దాదాపు ప్రతీ ఐపీఎల్‌ సీజ‌న్‌ను ముంబై ఓట‌మితోనే ప్రారంభించిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇది కేకేఆర్‪కు సానుకూల అంశమే. ముంబై మాత్రం ఈ సారి తొలి మ్యాచ్ విజయం సాధించి.. ఓటమి ప్రారంభాన్ని బ్రేక్ చేయాలనే కసితో ఉంది. 2008 ఐపీఎల్ ప్రారంభ సీజ‌న్ నుంచి చూసుకుంటే ఇప్పటి వ‌ర‌కు 35 సార్లు త‌ల‌ప‌డ‌గా ముంబై 24 సార్లు నెగ్గితే, కేకేఆర్ 11 సార్లు విజ‌యం సాధించింది.


బ‌ల‌బ‌లాల విష‌యానికొస్తే.. కేకేఆర్‌తో పోలిస్తే ముంబై బ్యాటింగ్ లైన‌ప్ కాస్త బ‌లంగా ఉంది. వరుసగా మూడో సీజన్‌లో హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇటీవ‌లే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన టీమిండియాలోని న‌లుగురు (పాండ్యా, సూర్యకుమార్‌, తిల‌క్ వ‌ర్మ, బుమ్రా) ముంబై జ‌ట్టులో ఉండ‌డం బ‌ల‌మ‌ని చెప్పొచ్చు. బౌలింగ్‌లో బుమ్రా మ‌రోసారి కీలకం కానుండ‌గా, కివీస్ మాజీ బౌల‌ర్ బౌల్ట్ కూడా ప్రమాదకారే.


ఇక కేకేఆర్ బ్యాటింగ్ విష‌యానికొస్తే ర‌హానే, సునీల్ నరైన్‌, సీఫెర్ట్‌, రఘువంశీ, రింకూ సింగ్‌తో పాటు ఆల్‌రౌండ‌ర్లు ర‌మ‌ణ్‌దీప్, కామెరున్ గ్రీన్‌లు కీల‌కం కానున్నారు. బౌలింగ్ విభాగంలో వ‌రుణ్ చ‌క్రవ‌ర్తి, వైభ‌వ్ అరోరా, ముజ‌రబానీ కీలక పాత్ర పోషించున్నారు. ఓపెనింగ్ బ్యాటర్ అజింక్య రహానే నేతృత్వంలోనే ఈ జట్టు కొనసాగుతుంది. దశాబ్దానికి పైగా ఆండ్రీ రస్సెల్ లేకుండా కేకేఆర్ ఆడుతున్న మొదటి సీజన్ ఇది కావడం గమన్హారం.


పిచ్ నివేదిక:

వాంఖడే స్టేడియం బ్యాటర్లకు అత్యంత అనుకూలమైనది. అలానే ఇది బౌలర్లకు కూడా బాగా సహకరిస్తుంది. బ్యాటర్లు, బౌలర్లు తమ తమ వైవిధ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడి వర్ష పడే అవకాశం లేదు. ఇవాళ జరిగే మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 230కి పైగా స్కోరు చేస్తే కాపాడుకోవచ్చు.

తుది జట్ల అంచనా:

ముంబై:

హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శ‌ర్మ, రియాన్ రికిల్‌ట‌న్ (వికెట్ కీప‌ర్‌), తిల‌క్ వ‌ర్మ, సూర్యకుమార్‌, రూథ‌ర్‌ఫోర్డ్‌, న‌మ‌న్ ధిర్‌, గ‌జ‌న్‌ఫ‌ర్‌, దీప‌క్ చాహ‌ర్‌, ట్రెంట్ బౌల్ట్‌, బుమ్రా

కేకేఆర్:

అజింక్యా ర‌హానే (కెప్టెన్‌), సునీల్ న‌రైన్‌, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌కీప‌ర్‌), కామెరున్ గ్రీన్‌, అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ, రింకూ సింగ్‌, ర‌మ‌న్‌దీప్ సింగ్‌, అనుకుల్ రాయ్‌, వ‌రుణ్ చ‌క్రవ‌ర్తి, వైభ‌వ్ అరోరా, ముజ‌ర‌బానీ


ఇవి కూడా చదవండి:

నితీశ్ కుమార్ రెడ్డిపై ధోనీ ఫ్యాన్స్ సెటైర్లు! ఎందుకంటే..

ఐపీఎల్ 2026: సంచలనాత్మక క్యాచ్‌లు అందుకున్న ఫిల్ సాల్ట్

Updated Date - Mar 29 , 2026 | 02:57 PM