విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుండెలాంటోడు: ఏబీ డివిలియర్స్
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:30 AM
ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ విరాట్ గురించి మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సందడి మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్‌ను మొదలుపెట్టనుంది. తన తొలి మ్యాచ్‌ను మార్చి 28న ఎస్ఆర్‌హెచ్‌తో ఆడనుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి ఇప్పటికే బెంగళూరు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజం, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ విరాట్ గురించి మాట్లాడాడు. ఫ్రాంచైజీకి హార్ట్‌బీట్ వంటి కోహ్లీ రాకతో ఆర్సీబీలో జోష్ వచ్చిందని అన్నాడు.
‘విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఫ్రాంచైజీకి గుండెలాంటోడు. కేవలం అతడి ప్రదర్శన ఆధారంగా ఈ మాట చెప్పడం లేదు. నాయకుడిగా గతంలో అందించిన విజయాలు, నిలకడైన ఆటతీరు, మైదానంలో సహచరుల్లో నింపే ఉత్సాహం.. ప్రతిదీ ఓ అద్భుతమే. జట్టు కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాడు. కుర్రాళ్లపై ఆత్మవిశ్వాసం, నమ్మకం పెంచేలా స్ఫూర్తినింపుతాడు. ప్రతి సంవత్సరం అదే జోష్‌తో ఉంటాడు. గతేడాది ఆర్సీబీ విజయంలోనూ కీలక పాత్ర పోషించాడు. జట్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో ముందుంటాడు. మొన్నటి వరకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఆడేవారు. ఇక నుంచి జట్టులోని ప్రతి ఒక్కరూ గెలుపు కోసం తమ భాగస్వామ్యం అందిస్తారని అనుకుంటున్నా. ఈసారి విరాట్ కోహ్లీ నుంచి అత్యున్నత ఆట బయటకు రానుంది’ అని ఏబీడీ తెలిపాడు.
అలా అయితేనే..
‘గత సీజన్ ఫైనల్‌లో కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అయితే లివింగ్‌స్టోన్, రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, రొమారియో షెఫర్డ్ అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా పరుగులు రాబట్టారు. చివరికి పంజాబ్ ఎదుట 190 పరుగులకు పైగా లక్ష్యాన్ని ఉంచారు. కృనాల్ పాండ్య బౌలింగ్‌లో మెరిశాడు. ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతోనే గతేడాది ఆర్సీబీ విజేతగా నిలిచింది. ప్రస్తుత సీజన్‌లోనూ జట్టులో మార్పులు పెద్దగా లేవు. ఎవరి ఆటతీరు ఏంటో సహచరులకు బాగా తెలుసు. విరాట్ కోహ్లీ వర్క్ ఎథిక్‌తో ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపుతాడు. అందుకే నమ్మకంగా చెబుతున్నా.. ఈసారి కూడా సూపర్ ఇన్నింగ్స్‌లు అతడి బ్యాట్ నుంచి రానున్నాయి. ఆర్సీబీ వరుసగా రెండోసారి టైటిల్ ముద్దాడబోతుంది’ అని ఏబీడీ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్2026: రోహిత్ అభిమానులకు అదిరిపోయే న్యూస్..
బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన!