తిలక్ వర్మపై రివేంజ్ తీర్చుకున్న వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 11 , 2026 | 07:58 AM
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య జరిగిన సరదా స్లెడ్జింగ్ ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నాలుగో రోజు తిలక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని టీజ్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ మధ్య జరిగిన సరదా స్లెడ్జింగ్ ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ నాలుగో రోజు తిలక్ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో వైభవ్ అతడిని టీజ్ చేశాడు. మ్యాచ్ తొలి రోజు వైభవ్‌ను తిలక్ స్లెడ్జ్ చేసిన సంగతి తెలిసిందే. అదే విషయాన్ని గుర్తుచేస్తూ ఈ చిచ్చర పిడుగు తనదైన శైలిలో బదులిచ్చాడు.
దులీప్ ట్రోఫీ నాలుగో రోజు తిలక్ వర్మ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో వైభవ్.. అతడిని భుజంతో తాకుతూ ఏదో వ్యాఖ్యలు చేశాడు. దీంతో తిలక్ వర్మ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. అంపైర్ వైభవ్‌తో మాట్లాడుతుండగా.. 15 ఏళ్ల ఈ యువ ఆటగాడు తనదైన శైలిలో స్పందించాడు. ‘సార్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నాకూ ఇలాగే జరిగింది’ అంటూ అంపైర్‌కు చెప్పాడు. వైభవ్ మాటలు సరదాగా సాగడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా తేలికగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే, దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో వైభవ్ ప్రాతినిధ్యం వహించిన ఈస్ట్ జోన్‌దే పైచేయి అయింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో సౌత్ జోన్‌ను ఓడించిన ఈస్ట్ జోన్.. 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ ఏకంగా 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం సౌత్ జోన్ 325 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన భారీ ఆధిక్యంతో ఈస్ట్ జోన్ విజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడటంపై మౌనం వీడిన రోహిత్ శర్మ
ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించిన బుమ్రా... అఫ్గాన్‌తో సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్