Share News

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:15 PM

వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంఐతో మ్యాచ్‌లో ఔటయ్యాక.. వైభవ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ మిస్ అయిందన్న బాధతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు.

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగు క్రికెట్‌లో సంచనాలు సృష్టిస్తున్నాడు. బౌలర్లు ఎవరైనా తన బ్యాట్‌తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్ 2026లోనూ వైభవ్ మేనియా కొనసాగుతోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు ఈ మ్యాచ్‌ను కుదించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్ఆర్.. బీభత్సం సృష్టించింది. వైభవ్ సూర్యవంశీ యథావిథిగా చెలరేగిపోయాడు. కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. ఏకంగా ఐదు సిక్సర్లు, ఒక ఫోర్ బాది సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.


అయితే వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దూకుడుగా ఆడుతున్న వైభవ్ సూర్యవంశీని శార్దూల్ ఠాకూర్ పెవిలియన్‌కు పంపాడు. ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి చేయాల్సిన విధ్వంసం అంతా చేసేసిన వైభవ్.. చిరునవ్వుకు బదులు కన్నీళ్లతో మైదానాన్ని వీడాడు. హాఫ్ సెంచరీ మిస్ అయిందన్న బాధతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లేటప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. డగౌట్‌లో కూడా చాలా సేపటి వరకు నిరాశగానే కనిపించాడు. జట్టు కోసం మరిన్ని పరుగులు చేయలేకపోయానని బాధపడటం వైభవ్ క్రీడాస్ఫూర్తికి అద్దం పడుతోంది.


బుమ్రాను బాదేశాడు..

మ్యాచ్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ, బుమ్రా క్లాష్ ఎలా ఉండనుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ఎంత సీనియర్ బ్యాటర్ అయినా తగ్గేదే లే అన్నట్టు.. బుమ్రా వేసిన తొలి ఓవర్లోనే రెండు సిక్సర్లు బాదేశాడు. ఇంత విధ్వంసం చేసి ఔటైనప్పటికీ వైభవ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టాడు. ‘నాకు సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.


ఇవి కూడా చదవండి:

అభిమానుల మనసు గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య

ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు

Updated Date - Apr 08 , 2026 | 03:15 PM