వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న సీఎస్కేకు.. మరో బిగ్ షాక్!
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:59 PM
గతేడాది మాదిరిగానే ఐపీఎల్ 2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ రుతురాజ్ సేన పరాజయం పాలైంది. ఈ క్రమంలోనే ఆ జట్టుకు ఓ బిగ్ షాక్ తగిలినట్లు సమాచారం.
స్పోర్ట్స్ డెస్క్: గతేడాది మాదిరిగానే ఐపీఎల్(IPL)2026లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ రుతురాజ్ సేన పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం చెన్నై జట్టు తీవ్రంగా పోరాడుతోంది. మరోవైపు సీఎస్కే స్టార్ ధోని (MS Dhoni)తో పాటు పవర్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వీరిద్దరు లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈనెల11న సీఎస్కే సొంతమైదానం చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌కు ధోని అందుబాటులో ఉంటాడని మేనేజ్‌మెంట్ తొలుత సంకేతాలు ఇచ్చింది. అతడు ఫిట్‌నెస్ టెస్టుకు కూడా హాజరుకానున్నట్లు తెలిపింది. కానీ, తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capital)తో జరిగే మ్యాచ్‌కు కూడా ఈ మిస్టర్ కూల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఓ స్పోర్ట్స్ మీడియా కథనం ప్రకారం.. ధోని పూర్తిగా కోలుకుని ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకో వారం పట్టనున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో ఏప్రిల్ 14న జరిగే మ్యాచ్ నాటికి ధోని అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మరోవైపు దక్షిణాఫ్రికా బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ పరిస్థితి మెరుగుపడుతోందని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌కు బ్రెవిస్ అందుబాటులో ఉంటాడని తాము ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి:
అభిమానుల మనసు గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య
ఒకేఒక్క మ్యాచ్.. జైస్వాల్ ఖాతాలో పలు రికార్డులు